వారానికి వారి సంపాదన రూ.లక్ష..!

Update: 2015-04-08 04:17 GMT
శేషాచల అడువుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు.. దొంగలపై అటవీ అధికారులు.. పోలీసులు భారీగా ఎన్‌కౌంటర్‌ జరపటం.. ఈ సందర్భంగా 20 మంది మృత్యువాత పడటం తెలిసిందే. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం దొంగలు మృతి చెందటం తీవ్ర సంచలనం రేకెత్తించింది.

చనిపోయిన వారిలో ఎక్కువ మంది నిరుపేదలని.. వారంతా కూలీలంటూ రాజకీయ పక్షాలు.. మానవహక్కుల సంఘాల వారు వేలెత్తి చూపుతున్నారు. విలువైన జాతీయ సంపదను దోచుకున్నా.. అలాంటి అసాంఘిక కార్యాకలపాల్ని అడ్డుకునేందుకు  ప్రయత్నించిన పోలీసులు.. అటవీశాఖ అధికారులపై రాళ్లతోనూ.. బరిసెలతోనూ దాడి చేస్తూ గాయపరుస్తుంటారు.

అయితే.. ఇలాంటి వారిని కూలీలుగా కొంతమంది చిత్రీకరించినా.. అదెంత వరకూ సమంజసమో ఎవరికి వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వారి ఆర్థిక పరిస్థితి చూపించి.. వారంతా కూలీలు అని ప్రచారం చేసే ధోరణి ఏమాత్రం మంచిది కాదు. ఇక.. ఇలాంటి వారిని ఎంపిక చేసే దళారులు పాత్ర ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైందని చెబుతారు.

ఎర్రచందనం స్మగ్గింగ్‌ చేసే పెద్ద తలకాయలు సీన్లోకి రాకుండా దళారీలను రంగంలోకి దించుతాయి. వీరి బాధ్యత ఏమిటంటే.. మెరికెల్లాంటి ఎర్రచందనం దొంగల్ని ఎంపిక చేయటమే. అలా ఎంపిక చేసిన వారిని గుట్టు చప్పుడు కాకుండా ఆడవుల్లోకి తీసుకెళ్లి ఎర్రచందనం చెట్లను నరికించి.. దాన్ని అడవిని దాటించే ప్రయత్నం చేశారు.

ఇలా ఒకరిద్దరతో కాకుండా.. పది నుంచి యాభై మంది మనుషులను అజమాయితీ చేసే ఈ మధ్యవర్తి దొంగల ఆదాయం వారానికి రూ.లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు. చెట్లు నరికి.. వాటిని ఎత్తుకొచ్చే దొంగలతో పోలిస్తే.. మాటలు చెబుతూ.. అజమాయిషీ చేసే వారి సంపాదన భారీగా ఉంటుందని చెబుతారు. మన రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వాలే కానీ ఇలాంటి మధ్యవర్తి స్మగ్లర్లకు కూడా మంచి పేరు ఒకటి పెట్టి వారి లాంటి ధర్మాత్ములు ఇంకెక్కడా ఉండరంటారేమో..?

Tags:    

Similar News