ఆ మంత్రిని ఏకాకిని చేస్తున్న దెవరు..?

Update: 2019-09-23 07:43 GMT
రాష్ట్ర గిరిజ‌న‌ - శిశుసంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌ ను సొంత పార్టీ ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారా.. మంత్రి ప‌ద‌విపై పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌లు కావ‌డంతో మ‌నోవేద‌న‌కు గురై, ఆమెను ఒంట‌రి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా ? అంటే ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ఇటీవ‌ల మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సీఎం కేసీఆర్ అనూహ్యంగా ఎమ్మెల్సీ స‌త్య‌వ‌తికి ప‌ద‌వి కట్ట‌పెట్టడాన్ని సీనియర్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. బ‌హిరంగంగానే త‌మ అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్నారు. 

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత - మాజీ మంత్రి - డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయ‌క్ - అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన స‌త్య‌వ‌తి రాథోడ్ సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వీరు వ‌రుస‌కు వియ్యంకుడు - వియ్య‌పురాలు కూడా అవుతారు. రెడ్యా కాంగ్రెస్‌ లో ఉంటే స‌త్య‌వ‌తి టీడీపీలో ఉండేవారు. చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు కుర‌వి జెడ్పీటీసీగా గెలిచిన ఆమె 2009లో టీడీపీ నుంచి డోర్న‌క‌ల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రెడ్యానాయ‌క్‌ పైనే సంచ‌ల‌న విజ‌యం సాధించారు.

తర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఇద్ద‌రూ టీఆర్ ఎస్ గూటికి చేరారు. అయిన‌ప్ప‌టికీ ఎడ‌మొహం పెడ‌మొహంగానే ఉండేవారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ క్యాడ‌ర్ సైతం రెండు వ‌ర్గాలుగా విడి పోయింది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఆదిప‌త్య పోరు కొన‌సాగుతున్న క్ర‌మంలోనే స‌త్య‌వ‌తి శాస‌న‌మండ‌లి కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌వ‌డంతో ఈ ఇద్ద‌రు మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింది. కేసీఆర్ ఆమెకు ఇచ్చిన మాట ప్ర‌కారం ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు.. అయితే ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఆమెను మంత్రిని చేశారు.

స‌త్య‌వ‌తి ఎమ్మెల్సీ అయ్యాక సీఎం కేసీఆర్ మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంట్ ఇన్‌ చార్జిగా ఆమెను నియ‌మించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన స్థానిక సంస్థ‌ల్లో ఎన్నిక‌ల్లో త‌న స‌మీప బంధువు ఆంగోత్ బిందుకు జెడ్పీ చైర్‌ ప‌ర్స‌న్ ప‌ద‌విని ఇప్పించుకున్నారు. అప్ప‌టి నుంచి స‌త్య‌వ‌తి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌న్నిహితంగా మెలుగుతున్నారు. ఈక్ర‌మంలోనే అనూహ్యంగా ఆమెకు కేసీఆర్ మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించ‌డం - గిరిజ‌న సంక్షేమ శాఖ‌ను అప్ప‌గించ‌డంతో డోర్న‌క‌ల్‌ - మానుకోట నియోజ‌వ‌ర్గాల్లో అసంతృప్తి ర‌గులుతోంది.

ఈ నేప‌థ్యంలోనే డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయ‌క్‌ - ఆయ‌న కూతురు - మ‌హ‌బూబాబాద్ ఎంపీ మా లోత్ క‌వితతోపాటు మానుకోట ఎమ్మెల్యే శంక‌ర్‌ నాయ‌క్ అధిష్టానం వ‌ద్ద త‌మ అంస‌తృప్తిని వెల్ల‌గ‌క్కారు. వాస్త‌వంగా చెప్పాలంటే రెడ్యానాయ‌క్‌ - ఎంపీ క‌విత‌కు మానుకోడ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌ కు ప‌డ‌దు. కాని ఇప్పుడు వీరంతా ఒక్క‌టై స‌త్య‌వ‌తికి వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నారు. శుక్ర‌వారం అసెంబ్లీ లాబీల్లోని మంత్రి చాంబ‌ర్‌ లో టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ - రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ను క‌లిసి త‌మ బాధ‌న వ్య‌క్తం చేశారు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోనే తానే సీనియ‌ర్ న‌ని - త‌న‌కు కాకుండా  - రాజ‌కీయ ప్రత్య‌ర్థి అయిన స‌త్య‌వ‌తి రాథోడ్‌ కు ఎలా మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని రెడ్యా ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.  ఈక్ర‌మంలోనే ఈ ముగ్గురు నేత‌లు మంత్రి స‌త్య‌వ‌తికి దూరంగా ఉంటున్నార‌ని - క‌నీసం వారి మ‌ధ్య మాట‌లు కూడా లేవ‌ని తెలుస్తోంది.

   

Tags:    

Similar News