2020 ఎంట్రీతోనే సమస్య.. జర జాగ్రత్త బాసూ

Update: 2019-12-27 12:59 GMT
కొత్త సంవత్సరం వస్తుంటే చాలామందికి ఒక ఇబ్బందిని ఎదుర్కొంటారు. తేదీ.. నెలను బాగానే వేసినా.. ఏడాదిని మాత్రం మర్చిపోతుంటారు. ఏడాది పాటు రాసిన ఇయర్ ను మొదటి రెండు నెలల్లో పాత ఏడాది వేయటం మామూలుగా జరిగేదే. దాని వల్ల కూడా పెద్దగా ఇబ్బంది ఉండదేమో కానీ.. తాజాగా వచ్చే 2020 ఏడాదిలో మాత్రం ఒక సిత్రమైన ఇబ్బంది ఉంటుందని చెబుతున్నారు.

సాధారణంగా ఇయర్ వేసే వేళ.. నాలుగు అంకెలకు బదులుగా చివరి రెండు అంకెలు వేయటం అలవాటు. ఇప్పుడు నడుస్తున్న 2019నే చూస్తే.. ఫిబ్రవరి రెండో తేదీ 2019 అంటే.. సింఫుల్ గా 02-02-19 అని షార్ట్ కట్ లో రాసేస్తాం. మరి.. 2020లో ఎలా రాస్తారని ప్రశ్నిస్తే.. ఏముంది ఎప్పటిలానే 20 అని రాస్తామన్నదే మీ సమాధానమైతే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే 20 అని రాస్తే.. ఆ తర్వాత ఏదైనా అంకెలు రాస్తే.. అర్థం పూర్తిగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది.

మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా చెక్కులు.. అగ్రిమెంట్లు.. దస్తావేజుల మీద రాసే వాటిల్లో మాత్రం 2020ని పూర్తిగా రాయకుండా 20 అని వదిలేస్తే మాత్రం తిప్పలు తప్పనట్లే. మనం మంచిగా ఉన్నా.. అవతలోడు తేడా అయితే 20 అని రాసి వదిలేయటం ద్వారా వారి చేతికి బ్రహ్మండమైన అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఉదాహరణకు 20 అని వదిలేస్తే.. చివరన రెండు అంకెలుగా 18 వేస్తే.. 2018 అయిపోవటమే కాదు.. అలా రాసింది అద్దె అగ్రిమెంట్ కానీ సేల్ డీడ్ కాని.. మరేదైనా పర్మిషన్ కు సంబంధించిన డాక్యుమెంట్ అయితే మాత్రం కొంప కొల్లేరు కావటం ఖాయం. అందుకే.. 2020లో మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం ఖాయం. ఇక.. సర్టిఫికేట్లు ఇతరత్రా విషయాల్లో కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News