ఆ రాక్షసులు మనోళ్లకు ఏం చెప్పారంటే.?

Update: 2015-08-02 04:35 GMT
తమ చేష్టలతో పురాణాల్లోని రాక్షసులకు మించి అన్నట్లుగా వ్యవహరించే ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తీవ్రవాదుల్లోని మరో కోణం బయటకు వచ్చింది. లిబియాలో నలుగురు భారతీయుల్ని వారు కిడ్నాప్ చేయటం.. అందులో ఇద్దరు కర్ణాటకకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు తెలుగువారు. కర్ణాటకకు చెందిన ఇద్దరిని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు వదిలేయటం తెలిసిందే.

ఇక.. తెలువారు ఇద్దరిని తమ చెరలోనే ఉంచుకున్న ఐఎస్ తీవ్రవాదులు.. వారిని ఇంకా విడిచిపించకపోవటం తెలిసిందే. తాజాగా.. ఐఎస్ తీవ్రవాదుల చెరలో నుంచి బయటపడ్డ కర్ణాటక వాసులు తమ అనుభవాల్ని చెప్పుకొచ్చారు. తమను కిడ్నాప్ చేసిన ఐఎస్ తీవ్రవాదులు తమది ఏ ధర్మం అంటూ ప్రశ్నించారని.. తాము హిందువులమని.. భారతదేశానికి చెందిన వారిమని చెప్పినట్లు పేర్కొన్నారు. తాము ఉపాధ్యాయులుగా పని చేస్తున్నామని చెప్పటంతో వారు తమ పట్ల మర్యాదగా ప్రవర్తించినట్లుగా వెల్లడించారు.

’’గురువులంటే మాకూ గౌరవమే. మీరు ఆందోళన చెందవద్దు. సురక్షితంగా విడిచి పెడతాం’’ అంటూ తమతో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తమతో వ్యాఖ్యానించినట్లుగా కిడ్నాప్ కు గురై.. విడుదలైన కన్నడిగులు తమ కుటుంబ సభ్యులు.. బంధువులకు ఫోన్లు చేసిన సమయంలో చెప్పినట్లుగా చెబుతున్నారు.

విద్యార్థులకు పాఠాలు బోధించే అధ్యాపకులమని తెలిసిన తర్వాత వారు తమతో మర్యాదగా వ్యవహరించినట్లు వారు చెప్పుకొచ్చారు. తమను కాకుండా మరో ఇద్దరు తెలుగువారిని కిడ్నాప్ చేసిన ఐఎస్ తీవ్రవాదులు.. వారిని కూడా క్షేమంగా విడుదల చేస్తారన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ నరరూప రాక్షసులుగా పేర్కొనే ఐఎస్ తీవ్రవాదుల్లో.. గురువుల్ని గౌరవించి.. మర్యాదగా చూసే కోణం కాస్త కొత్తదనే చెప్పాలి.
Tags:    

Similar News