లాభాల లెక్క‌లో అదిరేలా రిల‌య‌న్స్ రికార్డ్‌!

Update: 2019-01-18 05:22 GMT
వ్యాపారం ఏదైనా సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసే రిల‌య‌న్స్ అదిరే రికార్డును సొంతం చేసుకుంది. దేశంలో మ‌రే ప్రైవేటు కంపెనీ సాధించ‌ని విజ‌యాన్ని న‌మోదు చేసింది. అంచ‌నాల‌కు మించిన లాభాల‌తో ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. రిఫైన‌రీ మార్జిన్లు త‌గ్గినా.. మిగిలిన వ్యాపారాల్లో న‌మోదు చేసిన లాభాల‌తో క్యూ3 (ఆర్థిక సంవ‌త్స‌రంలో మూడో త్రైమాసికంలో) రికార్డు లాభాన్ని సంపాదించిన విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఒక త్రైమాసికంలో రూ.10వేల కోట్లకు పైగా లాభాన్ని న‌మోదు చేసిన తొలి ప్రైవేటు కంపెనీగా చ‌రిత్ర సృష్టించింది. గ‌త ఏడాది ఇదే క్యూ3 వేళ సాధించిన నిక‌ర లాభం రూ.9420 కోట్ల‌ను అధిగ‌మించి.. రూ.10వేల కోట్ల మార్క్ దాటిన తొలి కంపెనీగా త‌న స‌త్తాను చాటింది. మార్కెట్ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం ఈసారి క్యూ3లో రిల‌య‌న్స్ లాభం రూ.9648 కోట్లు ఉంటుంద‌ని భావించినా.. ఆ అంచనాల‌కు మించి లాభాల్ని ఆర్జించిన వైనాన్ని ముకేశ్ అంబానీ వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం రిల‌య‌న్స్ న‌గ‌దు నిల్వ‌లు రూ.77,933 కోట్లు కాగా.. గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి కంపెనీ వ‌ద్ద ఉన్న న‌గ‌దు నిల్వ రూ.76,740 కోట్లు. ఇదిలా ఉండ‌గా.. కంపెనీ రుణ‌భారం కింద‌టేడాది రూ.2,18,763 (డిసెంబ‌రు 31 - 2017) కాగా.. ఈసారి రూ.2,74,381 కోట్ల‌కు (డిసెంబ‌రు 31 - 2018 నాటికి) పెరిగింది. అయితే.. కంపెనీ లాభాల్లో దూసుకెళ్ల‌టం ఈ రుణ భారం పెద్ద స‌మ‌స్య కాబోద‌ని చెబుతున్నారు.

రిల‌య‌న్స్ బొకేలో రిల‌య‌న్స్ పెట్రో కెమిక‌ల్ ఆదాయం మూడో త్రైమాసికంలోనూ త‌గ్గ‌గా.. టెలికాం విభాగ‌మైన రిల‌య‌న్స్ జియో లాభాలు మూడో త్రైమాసికంలో 63 శాతం పెరిగి రూ.831 కోట్ల‌కు చేరాయి. జియో వినియోగ‌దారుల సంఖ్య 16 కోట్ల నుంచి 28 కోట్ల‌కు పెరిగింది. అయితే.. స‌గ‌టు యూజ‌ర్ నుంచి వ‌చ్చే ఆదాయం మాత్రం 15.5 శాతం త‌గ్గిన‌ట్లుగా వెల్ల‌డించారు.  ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే అతి పెద్ద మొబైల్ డేటా నెట్ వ‌ర్క్ గా జియో అవ‌త‌రించింద‌ని.. క్యూ3లో డేటా వినియోగం 431 కోట్ల గిగా బైట్స్ నుంచి864 కోట్ల గిగా బైట్స్ కు చేరిన‌ట్లుగా ముకేశ్ ప్ర‌క‌టించారు. స‌గ‌టున ప్ర‌తి జియో వినియోదారుడి డేటా వినియోగం 9.6 జీబీల నుంచి 10.8 జీబీల‌కు చేరిన‌ట్లుగా పేర్కొన్నారు.

రిల‌య‌న్స్ రిటైల్ విభాగం కూడా లాభాల్ని న‌మోదు చేసింది. నిత్య‌వ‌స‌రాలు విక్ర‌యించే రిల‌య‌న్స్ ఫ్రెష్.. స్మార్ట్ విభాగాలు మెరుగైన ప‌ని తీరును ప్ర‌ద‌ర్శించిన‌ట్లు పేర్కొన్నారు. ఫ్యాష‌న్.. లైఫ్ స్ట‌యిల్ విభాగంలో కొత్త‌గా 100 స్టోర్ల‌ను ప్రారంభించిన‌ట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా రిల‌య‌న్స్ కంపెనీల‌న్నీ లాభాల‌తో దూసుకెళ్ల‌టంతో నిక‌ర లాభంలో రికార్డును సృష్టించిన‌ట్లుగా అంబానీ పేర్కొన్నారు.


Full View

Tags:    

Similar News