మండే సూరీడ్ని మబ్బేయనుంది

Update: 2015-09-26 05:03 GMT
సాధారణంగా సెప్టెంబర్ వచ్చిందంటే అప్పుడప్పడు పడే చిరు జల్లులు.. వాతావరణం కాస్తంత చల్లగా ఉండటం సహజం. అందుకు భిన్నంగా చురుకులు పుట్టిస్తున్న సూరీడి మంటలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. పేరుకు సెప్టెంబరే కానీ.. ఎండ మండి పోవటంలో ఏప్రిల్ ను తలపిస్తోంది. దీనికి తోడు.. గత రెండు మూడు రోజుల పగటి ఉష్ణోగ్రతలు.. దశాబ్దాల రికార్డును తిరగరాసిన పరిస్థితి.

భానుడి తీవ్రతతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు ప్రజలకు కాసింత కూల్ వార్త. మండుతున్న ఎండలు శని.. ఆదివారాల్లో కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.

తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల కారణంగా అక్టోబరు మొదటి వారం వరకూ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. తెలంగాణ వరకూ వస్తే మాత్రం.. అక్టోబరు నుంచి వచ్చే ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉండదన్నది కాస్త నిరాశ కలిగించే అంశమే. ఈశాన్య రుతుపవనాల్ని కాస్త పక్కన పెడితే.. ఈ రెండు రోజులతో పాటు.. అక్టోబరు మొదటి వారం వరకూ ఎంతోకొంత కూల్ కూల్ వాతావరణం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News