కౌర‌వుడిగా మోదీ..ద్రౌప‌దిగా రేణుక‌..వైర‌ల్ పోస్ట‌ర్!

Update: 2018-02-10 16:19 GMT
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ లేని భారత్ నినాదం తనది కాదని, గాంధీజీదేనని చేసిన వ్యాఖ్యల‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి బిగ్గ‌ర‌గా నవ్వడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. స‌భ‌లో బిగ్గ‌ర‌గా న‌వ్వుతున్న రేణుక‌ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారించారు. అదే స‌మ‌యంలో...రేణుక న‌వ్వుపై ప్రధాని మోదీ వెట‌కారంగా స్పందించారు. రేణుకాజీని నవ్వనివ్వాల‌ని - అప్పట్లో రామాయణం సీరియల్ లో అలాంటి నవ్వులు విన్నామ‌ని - మ‌ళ్లీ ఇపుడు మరోసారి ఆ న‌వ్వులు వినే సౌభాగ్యం క‌లిగింద‌ని సెటైర్ వేయ‌డం పెను దుమారం లేపింది. మోదీ తనపై వ్యక్తిగతంగా అనుచిత‌ వ్యాఖ్యలు చేశారని, ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని, ఆయన స్థాయికి దిగజారి తాను బదులివ్వలేన‌ని, ఇది మహిళలను కించపరిచడమేన‌ని రేణుక‌ మండిప‌డ్డారు. మోదీపై ఆమె అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేయడం తాను విన్నానని అన్నారు, మహిళ అనే కవచాన్ని అడ్డుపెట్టుకుని రేణుక మాట్లాడడం స‌మంజ‌సం కాద‌ని  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తాజాగా, ఈ వివాదంపై ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు హసీబ్‌ అహ్మద్ వ్యంగ్యంగా ఓ పోస్ట‌ర్ ను రూపొందించారు.

రేణుకను మహాభారతంలోని ద్రౌపదితో పోల్చుతూ వేసిన ఆ పోస్టర్ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలను చేస్తున్న మోదీ.. ఓ మహిళా ఎంపీ నవ్వును అవహేళన చేయడంపై హసీబ్ ​అహ్మద్‌ మండిపడ్డారు. దేశ‌ మహిళలందరికీ ప్రధాని క్షమాపణ చెప్పాలని హసీబ్‌ అహ్మద్ తో పాటు మ‌రికొంద‌రు డిమాండ్ చేశారు. ఆయ‌న వేసిన పోస్టర్ లో మోదీ - అమిత్‌ షా - కిరణ్‌ రిజిజులను కౌరవులుగా చిత్రీకరించారు. ఎల్ కే అద్వాణీని అంధరాజు ధృతరాష్ట్రుడిగా - రాహుల్‌ గాంధీని శ్రీకృష్ణుడి గా చూపించారు. రాహుల్....రేణుక‌కు చీర ఇస్తున్న‌ట్లుగా చిత్రీక‌రించారు. రక్షామ్‌ రాహుల్‌ గాంధీ( రాహుల్‌ గాంధీ రక్షించండి) అంటూ పోస్టర్ పై ముద్రించారు. ‘ఓ మహిళ నవ్విందని దుర్యోధనుడు అహంకారంతో చేసిన పనికి 101 మంది కౌరవులు మరణించారన్నది మర్చిపోకండి’ అంటూ ఆ పోస్ట‌ర్ కు ట్యాగ్‌ లైన్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆ పోస్ట‌ర్ సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.
Tags:    

Similar News