తుమ్మలకే సీన్‌ లేదు - నామా ఏం గెలుస్తాడు - రేణుకా చౌదరి

Update: 2019-04-04 16:31 GMT
కాంగ్రెస్‌ పార్టీ ఫైర్‌ బ్రాండ్‌ రేణుకా చౌదరి. అసలు ఫైర్‌ బ్రాండ్‌ అనే పదం వచ్చిందే రేణుకా చౌదరి వల్ల. కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా - హైకమాండ్‌ తో మంచి పరిచయాలు ఉన్న రేణుకా.. లోక్‌ సభ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈసారి ఎలాగైనా సరే ఖమ్మం లోక్‌ సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరేసి తన సత్తా ఏంటో అధిష్టానానికి చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు  రేణుకా చౌదరి. అందుకే.. తను పేరు ప్రకటించినప్పటి దగ్గరనుంచి ఖమ్మం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు జరుపతున్నారు. పనిలో పనిగా నామాని కూడా ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
           
ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన రేణుక.. మొదటినుంచి ఈ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అని అభివర్ణించారు. నామాను గెలిపిస్తే మనకు పంగనామాలు పెడతారని.. ఇప్పటికే ఆయన పార్టీ మారిన వ్యక్తి అని అందరూ గుర్తించుకోవాలని అన్నారు. నామా నాగేశ్వరరావుకి ఓటేసి ఖమ్మం జిల్లా ప్రజలు నామాలు పెట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తనని ఓడించేందుకు ఖమ్మం జిల్లాల్లో ఉన్న టీఆర్‌ ఎస్‌ శక్తుల్నీ ఏకమయ్యాయని.. అయినా అది వాళ్ల తరం కాదు కదా - వాళ్ల జేజమ్మ తరం కూడా కాదని తనదైన స్టైల్లో పంచ్‌ లు విసిరారు రేణుక.

మరోవైపు గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఘోర పరాజయం పొందింది టీఆర్‌ ఎస్‌ పార్టీ. ఒక్క పువ్వాడ అజయ్‌ మినహా అందరరూ ఓడిపోయారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల కూడా ఓడిపోయారు. దీంతో.. ఈసారి ఎలాగైనా ఖమ్మం స్థానాన్ని గెల్చుకోవాలని ఆశపడుతున్న టీఆర్‌ ఎస్‌.. నామా నాగేశ్వరరావుని బరిలోకి దింపింది. అంతేకాకుండా ఇద్దరు మంత్రుల్ని కూడా అదే పనిపై పెట్టింది. కానీ నామా ఏమో సైకిల్‌ గుర్తుకే ఓటు అంటూ పాత పార్టీని మర్చిపోలేకపోతున్నారు. మరి రేణుక - నామాల్లో విజయం ఎవరిదో తెలియాలంటే  ఇంకొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.   


Tags:    

Similar News