ఫైర్ బ్రాండ్ క్వశ్చన్... కేసీఆర్ ఆన్సరిస్తారా?

Update: 2019-04-08 16:55 GMT
తెలుగు నేలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. రేపటితో ప్రచారం ముగియనుండగా... అన్ని పార్టీల నేతలు తమ చివరి అస్త్రాలను సంధిస్తున్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ ఓ స్థాయిలో ఉండగా... కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్న తెలంగాణలో నిన్నటిదాకా కాస్తంత తక్కువ హడావిడి ఉన్నా... నేడు ప్రచారం బాగానే హీటెక్కిపోయింది. ఓ వైపు సీఎం కేసీఆర్, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతల నోట నుంచి మాటలు తూటాల్లా వచ్చేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ ిమేజీ సంపాదించుకున్న మాజీ ఎంపీ, ప్రస్తుతం ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి... ఖమ్మం రోడ్ షోలో భాగంగా కేసీఆర్ పై డైరెక్ట్ గానే అటాక్ చేశారు. ఆ అటాక్ కూడా మామూలుగా లేదన్న వాదన వినిపిస్తోంది.

కేసీఆర్ సర్కారు విధానాలపై నిప్పులు చెరిగిన రేణుక... కేసీఆర్ నోట నుంచి సమాధానం వచ్చే అవకాశమే లేని ప్రశ్నలను కూడా సంధించారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కథేమైందంటూ ఆమె సంధించిన ప్రశ్న ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయిందని చెప్పాలి. అటు కేంద్రంలో నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ నియంతల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగిన రేణక... ప్రజాస్వామ్యంలో విపక్షం పాత్ర ఉండి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. అందుకు విరుద్ధంగా... ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం పాలు జేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, అసలు రాష్ట్రంలో విపక్షమన్నదే లేకుండా చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ తరహా విధానం సరికాదని కూడా కేసీఆర్ కు సూచించారు. ప్రజలపై తమకు ఎనలేని అభిమానం ఉందని కేసీఆర్, సహా టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలంతా కేవలం కలరింగ్ మాత్రమే ిస్తున్నారని కూడా రేణుక ఎద్దేవా చేశారు.

ప్రజల సంక్షేమంపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే కేసీఆర్... బయ్యారంలో నిర్మిస్తామని చెప్పిన ఉక్కు ఫ్యాక్టరీ కథ ఏమైందో చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. గడచిన ఐదేళ్లలో అసలు బయ్యారం ఫ్యాక్టరీ మాటే ఎత్తకుండా పాలన సాగించారని ఆమె విరుచుకుపడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు మద్దతు ధర లేకపోతే... రైతుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించిన రేణుక... మద్దతు ధర కోసం రైతులు నినదించడాన్ని కూడా సహించలేకపోతే ఎలాగంటూ నిప్పులు చెరిగారు. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులకు బేడీలు వేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. రైతులను రాజులను చేస్తామంటూ హామీలు గుప్పించి.. అదే రైతులకు బేడీలు వేయడమేమిటని కూడా ఆమె కేసీఆర్ సర్కారును నిలదీశారు. ఇదంతా చూస్తుంటే... కేసీఆర్ సర్కారు చెప్పేదొకటి, చేసేదొకటేనని అర్థమైపోతోందని కూడా ఆమె విరుచుకుపడ్డారు. మొత్తంగా కేసీఆర్ తీరుపై సరిగ్గా పోలింగ్ ముంగిట రేణుక కడిగిపారేశారన్న వాదన వినిపిస్తోంది.


Tags:    

Similar News