గుడివాడకు రేణుకమ్మ వస్తే... కొడాలి పరిస్థితేంటి...?

Update: 2022-09-22 02:30 GMT
గుడివాడ అంటే కొడాలి నానిది అన్న భావన రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కలిగించేశారు. ఎవరు అవునన్నా కాదన్నా కొడాలి నాని మాస్ లీడర్. ఆయనను గుడివాడ బయట జనాలు ఏమనుకున్నా బూతుల మంత్రి అని తిట్టినా గుడివాడలో మాత్రం ప్రజలకు బాగా దగ్గరగా ఉంటారని చెబుతారు. సాదాసీదాగా నడచుకుని వెళ్ళి టీ కొట్టు దగ్గర టీ తాగి అక్కడ జనాలతో పిచ్చాపాటీ పెడతారని అంటారు.

అలాగే చనువుగా ప్రతీ ఇంటిలోకి వెళ్ళి కబుర్లు చెబుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తారు అని కూడా అంటారు. గుడివాడలో రెండున్నర లక్షల ఓట్లు ఉంటే కమ్మ సామాజికవర్గం ఓట్లు జస్ట్ పదహార వేలు మాత్రమే. ఇక కాపులు అరవై వేల ఓట్ల దాకా ఉన్నారు. ఈ రెండూ కాక మిగిలిన ఓట్లు బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు ఇలా ఉంటాయి. అగ్ర వర్ణాల ఓట్లు కూడా ఇందులో ఉంటాయి.

చిత్రమేంటి అంటే  బీసీలు, ఎస్సీలు,  మైనారిటీలలో కొడాలి నానికి పట్టుంది. వారే ఎపుడూ ఆయనకు అతి పెద్ద ఓటు బ్యాంక్ అని అంటారు. కాపులలో కూడా మెజారిటీ ఆయన్నే ఆదరిస్తోంది. ఇక కమ్మలు పదహారు వేలు ఉంటే అత్యధిక శాతం నాని వైపున ఉంది అనడం కంటే ఉంచుకున్నారు అని చెప్పాలేమో. ఏ కష్టమొచ్చినా తాను ఉన్నాను అని నిలబడే కొడాలి నాని అంటే అందుకే అక్కడ జనం అభిమానం చూపిస్తారు అని చెబుతారు.

నాని బోల్డ్ గా మాట్లాడుతారు, ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. అందుకే ఆయన అంటే ఇష్టమని అక్కడ జనం అంటారు. నేను లారీలు కడిగి వచ్చిన వాడినే అని కొడాలి నాని ఓపెన్ గా తన పూర్వాశ్రమం గురించి చెప్పుకుంటారు. అయితేనేమి నేను రాజకీయాల్లోకి రాకూడదా అని ఆయన నిగ్గదీస్తారు. ఇక తాను ఒకటో రెండో టెర్ములు పోటీ చేసి రిటైర్ అయిపోతాను అని కూడా ఆయన ఇప్పటి నుంచే చెబుతూ జనాలలో ఒక ఎమోషనల్ ఫీలింగ్ కలగచేస్తారు.

మొత్తానికి తప్పో రైటో ఏది అయినా దూకుడుగా మాట్లాడే నాని క్యారక్టరే గుడివాడ జనాలను అట్రాక్ట్ చేస్తోంది అని అంటారు. అలాంటి గుడివాడలో నానిని ఓడించాలని గత రెండు ఎన్నికల నుంచే తెలుగుదేశం పార్టీ చూస్తోంది కానీ వీలు కావడం లేదు. అక్కడ రాజకీయ సామాజిక సమీకరణలు తీసుకున్నా వేటి నుంచి కూడా  ఫలితం ఉండడం లేదు అని అంటున్నారు. ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ నేత రేణుకమ్మ తాను గుడివాడలో ఎంట్రీ ఇచ్చి పోటీకి దిగుతాను అని అంటున్నారు.

మరి ఆమె గట్స్ ఉన్న నాయకురాలు. ఆమెను ఎన్టీయార్ రాజకీయాల్లో పరిచయం చేశారు. ఆమె నిండు గర్భిణిగా ఉంటూ 1984లో అన్న గారు పదవి పోయినపుడు హైదరాబాద్ లో రోడ్ల మీదకు వచ్చి పోరాడిన ధీర వనిత. దానికే మెచ్చుకుని 1986లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమెను టీడీపీ తరఫున నిలబెట్టి ఎన్టీయార్ గెలిపించారు. అనతికాలంలోనే ఆమె స్టేట్ లీడర్ అయిపోయారు. ఎన్టీయార్ వెన్నటే ఉండేవారు. ఆమెను చూసి ఎన్టీయార్ మగరాయుడు అని ప్రేమతో పిలిచేవారు.

అలాంటి రేణుక ఎన్టీయార్ ని మొదటిసారి ఎదిరించింది లక్ష్మీపార్వతి ఎపిసోడ్ లోనే. ఏకంగా ఎన్టీయార్ ఎదురుగానే మీ నిర్ణయం బాలేదు అని చెప్పేసి వచ్చారు. ఆమె టీడీపీలో ఎన్టీయార్ తరువాత గౌరవించిచేది చంద్రబాబు నాయుడునే. ఆయన కష్టంతోనే టీడీపీ ఉంది అనేవారు. ఆమె టీడీపీలో ఉన్నంతకాలం చంద్రబాబు వర్గంగా ఉండేవారు.

ఇక కాంగ్రెస్ లోకి ఆమె ప్రవేశించి కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. ఆమె కూడా డేరింగ్ అండ్ డేషింగ్ లేడీ. ఆమెకు కూడా ఎన్టీయార్ అంటే ప్రాణం. మరి రేణుకమ్మ గుడివాడలో పోటీకి దిగితే పోరు ఎలా ఉంటుంది అన్నదే ఆసక్తికరం. ఇద్దరు ఎన్టీయార్ భక్తుల మధ్య పోరులా దాన్ని చూస్తారా లేక ఇద్దరు గట్స్ ఉన్న లీడర్స మధ్య ఫైట్ గా తీసుకుంటారా అన్నది చూడాలి.

ఇక్కడ రేణుకమ్మ కాంగ్రెస్ తరఫున పోటీ అంటున్నారు. మరి టీడీపీ తన క్యాండిడేట్ ని పెడుతుందా లేక మద్దతు ఇస్తుందా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా ఒక్క మాట గుడివాడలో రేణుకమ్మ కొడాలి నాని మధ్యన రసవత్తర పోరు జరిగే అవకాశాలు ఎంత ఉన్నా కొడాలి కత్తికి మాత్రం అక్కడ ఎదురులేదు అన్నదే జనం మాట. మరి చూడాలి ఏం జరుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News