ఐసిస్ లో చేరి చచ్చిన రేపల్లె వాసి

Update: 2015-12-08 04:10 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న సరికొత్త భూతం ఇస్లామిక్ స్టేట్ ఊడలు ఎంత భారీగా విస్తరించాయనటానికి తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతమే నిదర్శనంగా చెబుతున్నారు. ఇంతకాలం ఐసిస్ తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఉందన్న వాదనను కొట్టి పారేస్తూ.. ఏపీకి సైతం ఐసిస్ పాకిందన్న విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తుల్ఫిజుర్ రెహ్మాన్ తాజాగా సిరియాలో జరిగిన దాడుల్లో మరణించినట్లుగా గుర్తించారు. ఇతగాడు మచిలీపట్నంలో ఇంజనీరింగ్ లో పూర్తి చేసి.. కొన్నేళ్ల కిందట కువైట్ కు ఉద్యోగం కోసం వెళ్లాడు. అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఏడాది నుంచి అతడితో కుటుంబ సభ్యులకు సంబంధాలు పూర్తగా తెగిపోయినట్లుగా చెబుతున్నారు.

ఐసిస్ కార్యకలాపాల మీద ఆకర్షణతో కువైట్ లో ఉద్యోగం మానేసి సిరియాకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. అతగాడు ఐసిస్ లో చేరినట్లుగా ప్రాధమిక ఆధారాలు లభించాయి. తాజాగా సిరియాలో జరిగిన దాడుల్లో రెహ్మాన్ మరణించినట్లుగా తేలటంతో ఏపీ.. తెలంగాణ ప్రాంతాల పోలీసులు అలెర్ట్ అయ్యారు. రెహ్మాన్ మరణంతో ఏపీలోని విజయవాడ.. మచిలీపట్నం.. ఏలూరులలో ఐఎస్ కార్యకలాపాల మీద కొత్త ఆరా మొదలైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంతో.. విచారణ సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ లెక్కన ఎక్కడో సదూరాన ఉన్నారనుకునే నరరూప రాక్షసలు మన మధ్యన కూడా ఉన్నారన్నది ఇప్పుడు చేదు నిజం. సో.. తస్మాత్ జాగ్రత్త సుమా.
Tags:    

Similar News