బాబుకు షాక్.. చంద్ర‌గిరిలో ఐదు చోట్ల రీపోలింగ్‌!

Update: 2019-05-16 05:38 GMT
అనుకోని రీతిలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఏపీలో చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ పూర్తి అయిన పాతిక రోజుల త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఓట‌ర్ల చేత ఓట్లు వేయ‌కుండా అధికార‌ప‌క్షం అడ్డుకుందన్న ఆరోప‌ణ‌లు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌రికొత్త ఆదేశాల్ని జారీ చేసింది.

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల 19న ఉద‌యం ఏడు గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కూ స‌ద‌రు ఐదు పోలింగ్ బూత్ ల‌లో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. గ‌త నెల 11న పోలింగ్ పూర్తి అయిన అంశంపై ఈ నెల 10.. 11 తేదీల్లో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి విన‌తి అంద‌టం.. అనంత‌రం జిల్లా ఎన్నిక‌ల అధికారితో మాట్లాడిన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. రీపోలింగ్ కు ఓకే చెప్ప‌టం విశేషం.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఎన్ఆర్ క‌మ్మ‌ప‌ల్లె.. క‌మ్మ‌ప‌ల్లె.. పులివ‌ర్తిప‌ల్లె.. కొత్త కండ్రిగ‌.. వెంక‌ట్రామ‌పురంలో రీపోలింగ్ కు అనుమ‌తులు జారీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. రీపోలింగ్ ను స‌జావుగా నిర్వ‌హించాల‌ని ఈసీ పేర్కొంది.

అంతా బాగానే ఉంది కానీ.. పోలింగ్ పూర్తి అయిన పాతిక రోజుల త‌ర్వాత ఫిర్యాదు చేస్తే.. రీపోలింగ్ కు ఈసీ ఓకే చెప్ప‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా ప‌రిణామం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు షాకింగ్ గా మారింద‌ని చెబుతున్నారు. త‌న సొంత జిల్లాలో తాను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న సీటు విష‌యంలో చోటు చేసుకున్న ప‌రిణామం ఆయ‌న‌కు మింగుడుప‌డ‌టం లేదంటున్నారు.
Tags:    

Similar News