ఏపీలో రీపోలింగ్ ఎలా జ‌రుగుతుంటే?

Update: 2019-05-06 05:50 GMT
ఏపీలో రీపోలింగ్ మొద‌లైంది. రాష్ట్ర‌వ్యాప్తంగా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ను నిర్వ‌హిస్తున్నారు. ముందుగా పేర్కొన్న షెడ్యూల్ ప్ర‌కారం ఉద‌యం ఏడు గంట‌ల నుంచే పోలింగ్ ప్రారంభ‌మైంది. ఏపీలో రీపోలింగ్ జ‌రుగుతున్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్లు వేసేందుకు ఓట‌ర్లు బారులు తీరుతున్నారు. ఉద‌యం 7 గంట‌ల నుంచే పోలింగ్ జ‌రుగుతోంది. ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ఓట‌ర్లు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. పోలింగ్ స్టార్ట్ అయిన ఏ పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎంలు మొరాయించిన‌ట్లుగా స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. ఏప్రిల్ 11న జ‌రిగిన పోలింగ్ సంద‌ర్భంగా ఈవీఎంల‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు చోటు చేసుకున్నాయి.

పోలింగ్ జ‌రుగుతున్న కేంద్రాల వారీగా చూస్తే..

+  గుంటూరు జిల్లాలో రీ పోలింగ్‌ జరుగుతున్న రెండు కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఓటర్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలోని బూత్‌ నంబర్‌ 244లో ఇప్పటివరకూ  (ఉద‌యం 9 గంట‌ల‌కు) 129 ఓట్లు పోలయ్యాయి. నరసరావుపేట మండలం కేసానుపల్లిలో 80 ఓట్లు పోల్‌ అయ్యాయి.

+ గుంటూరు వెస్ట్ లోని న‌ల్ల‌చెరువులో బూత్ నెంబ‌రు 244 రీపోలింగ్ సంద‌ర్భంగా అర్బ‌న్ పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిబంధ‌న‌ల ప్ర‌కారం పోలింగ్ బూత్ ల‌లోకి మీడియాకు ప్ర‌వేశం ఉంటుంది. అయితే.. అలాంటివి కుద‌ర‌ద‌ని.. పాసులున్న‌ప్ప‌టికీ పోలింగ్ బూత్ ల్లోకి మీడియాను అనుమ‌తించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. పోలింగ్ కేంద్రానికి వంద మీట‌ర్ల దూరంలో ఉండాలంటూ పోలీసుల మాట‌ల‌ను ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

+  ప్రకాశం జిలా ఎర్రగొండపాలెం పరిధిలోని కలనూతలలో రీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో కలనూతలలో రాత్రి పన్నెండు తరువాత కూడా క్యూ లో ఓటర్లు వున్నారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఓటు వేయలేకపోయారు. దీంతో రాజకీయ పార్టీలు, ఓటర్లు విన‌తి మేరకు ఎన్నికల సంఘం రీ పోలింగ్‌ నిర్వహిస్తోంది. కలనూతల 247 పోలింగ్ బూత్‌ లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్‌ కొనసాగుతోంది.

+  నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ఇసుకపాలెంలో రీ పోలింగ్‌ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఓటు వేసేందుకు ఉదయం నుంచే క్యూ లైన్ల‌లో వేచి ఉన్నారు. రీ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.


Tags:    

Similar News