రూ.1000 నోటుపై ఆర్థిక శాఖ క్లారిటీ!

Update: 2017-08-29 16:58 GMT
గ‌త ఏడాది రూ.1000, రూ.500 నోట్ల ర‌ద్దు త‌ర్వాత భారీ స్థాయిలో చిల్ల‌ర కొర‌త ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. రూ.500 కొత్త నోటును ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టికీ ఆ చిల్ల‌ర కొర‌త పూర్తిగా తీర‌లేదు. దీంతో - చిల్ల‌ర కొర‌త‌ను తీర్చేందుకు కొత్త‌గా రూ.200 - రూ.50 నోట్ల‌ను ఆగ‌స్టు 25న  ఆర్బీఐ చ‌లామ‌ణీలోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో రద్దు చేసిన రూ.1000 నోటును కూడా మళ్లీ చలామణిలోకి తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. త్వ‌ర‌లో వాటి ముద్ర‌ణ ప్రారంభ‌మ‌వ‌బోతోంద‌ని - ఈ ఏడాది డిసెంబ‌రు నాటికి వాటిని విడుదల చేసే అవకాశాలున్న‌ట్లు అన‌ధికారిక స‌మాచార‌ముంద‌ని కొన్ని మీడియా సంస్థలు కూడా తెలిపాయి. ఈ వార్త‌ల నేప‌థ్యంలో కొత్త రూ.1000 నోట్ల‌పై కేంద్ర‌ ఆర్థికశాఖ స్పష్టత ఇచ్చింది. రూ.వెయ్యి నోటును మళ్లీ తీసుకొచ్చే ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌ సీ గార్గ్  స్ప‌ష్టం చేశారు.

పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం రూ.500 - రూ.2000 నోట్ల‌ను కేంద్రం చ‌లామ‌ణీలోకి తెచ్చింది. అయితే, రూ. 500, రూ. 2000 నోట్లకు మ‌ధ్య వార‌ధిలా ప‌నిచేసే రూ. 1000 నోటు లేకపోవ‌డం వ‌ల్ల చిల్ల‌ర కొర‌త పూర్తిగా తీర‌లేద‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఆర్బీఐ త్వ‌ర‌లోనే స‌రికొత్త రూ.1000 నోటును చ‌లామ‌ణీలోకి తెచ్చే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపించాయి. కొత్త టెక్నాలజీ, భద్రతాపరమైన ఫీచర్లతో ఈ నోటును ఆర్‌ బీఐ తీసుకురానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ముద్ర‌ణ‌ను కూడా త్వ‌ర‌లో మైసూరు - స‌ల్బోని ప్రింటింగ్ ప్రెస్ ల‌లో ప్రారంభించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌నే వ‌దంతులు వినిపించాయి. ఇప్ప‌టికే ఈ నోటుకు సంబంధించిన డిజైన్ - ముద్రించడానికి ఉప‌యోగించాల్సిన పేప‌ర్‌ పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఇంగ్లిషు వెబ్ సైట్ల‌లో క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. గ‌తంలో రూ.2000 నోటు విడుద‌ల‌కు ముందే ఇంట‌ర్నెట్ లో ద‌ర్శ‌న‌మిచ్చిన త‌ర‌హాలోనే రూ.1000 నోటు ఫొటో ఒక‌టి ఇంట‌ర్నెట్ లో హ‌ల్ చ‌ల్ చేయ‌డంతో ఆ వార్త‌లు నిజ‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన క్లారిటీతో ఆ ఊహాగానాల‌కు తెర‌ప‌డిన‌ట్ల‌యింది.
Tags:    

Similar News