హామీలిచ్చి మరిస్తే..అక్కడ ఆడ వేషాలేస్తారట!

Update: 2019-08-06 13:58 GMT
ఎన్నికల్లో రాజకీయ నేతలు హామీలిస్తారు. ఆ తర్వాత మరిచిపోతారు. మళ్లీ ఎన్నికలు వస్తే గానీ... తాము ప్రజలకిచ్చిన హామీలు నేతలకు గుర్తుకు రావు. వచ్చినా కూడా మళ్లీ పాత హామీలనే గుప్పించేసి పని కానిచ్చేస్తారు. ఇది మన వద్ద జరుగుతున్న తంతు. హామీలిచ్చేసి పదవులు ఎక్కేశాక - అవే హామీలను ఎంచక్కా అటకెక్కించేసే మన నేతలను మనం ఏమీ చేయలేకపోతున్నాం. అయితే ఈ విషయంలో మెక్సికో జనం మాత్రం ఊరికే కూర్చోవట్లేదు. ఎన్నికల్లో హామీలిచ్చిన నేతలు... అధికారంలోకి వస్తే వాటిని అమలు చేసి తీరాల్సిందేనని పట్టు బడుతున్నారు. అంతేనా... హామీలను అమలు చేయని నేతలకు విచిత్ర శిక్షలేస్తూ... హామీల అమలును మరిచిపోవడమంటేనే నేతల్లో వణుకు పుట్టేలా చేస్తున్నారు. నిజమా? అంటే... అక్కడి ఓ పత్రిక రాసిన కథనం నిజమేనని చెబుతోంది.

ఎన్నికల్లో హామీలు గుప్పించి వాటిని అమలు చేయని ఇద్దరు ప్రజా ప్రతినిధులకు ఏకంగా మహిళల వస్త్రాలు వేసి బహిరంగంగా ఊరేగించి - వారితోనే భిక్షమెత్తించారు. ఈ ఘటనకు సంబంధించిన కథనం ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ కథాకమామీషులోకి వెళితే... దక్షిణ మెక్సికోకు చెందిన ఎంపీలు జేవియర్ జిమెనెజ్ - లూయిస్ టన్ లు ఎన్నికల సందర్భంగా తమ నియోజకవర్గ ప్రజలకు పలు హామీలిచ్చారట. వాటిలో ప్రధానమైనది మంచి నీటి సరఫరాను మెరుగుపరుస్తామని వారు హామీ ఇచ్చారట. ఇందుకోసం ఏకంగా రూ.1,08,32,651 కోట్లను కేటాయిస్తామని కూడా చెప్పారట.

అయితే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వీరిద్దరిలో జేవియర్ మేయర్ గా - లూయిస్ టన్ మునిసిపాలిటిలో ఓ కీలక పదవిలో ఉండి కూడా ఈ హామీని అమలు చేయలేదట. దీంతో చిర్రెత్తిన అక్కడి స్థానికులు వారిద్దరికీ మహిళల వస్త్రాలు కట్టించేసి ఊరేగించారట. అంతేకాకుండా మహిళల వస్త్రధారణలో రోడ్డుపై నడుస్తున్న వారిద్దరి చేతిలో బొచ్చెలు పెట్టించి మరీ భిక్షమెత్తించారట. అంతకుముందు అసలు హామీలు ఎందుకు అమలు చేయలేదంటూ వారిద్దరినీ ప్రశ్నించిన ప్రజలు నాలుగు రోజుల పాటు బంధించారట. పోలీసులు జోక్యం చేసుకోవడంతో నిర్బంధం నుంచి వారిద్దరికీ విముక్తి లభించినా... ప్రజల చేతిలో మాత్రం ఈ అవమానకర సన్మానం మాత్రం తప్పలేదు. నిజమే మరి... హామీలిచ్చి అమలు చేయకుంటే ఈ తరహా శిక్షలు తప్పు కాదు కదా. ఈ తరహా శిక్షలు మన వద్ద కూడా అమలైతే ఎంత బాగుంటుందో కదా.
   

Tags:    

Similar News