అమరావతి రైతుల పాదయాత్ర రీస్టార్ట్....వైసీపీ కి డబుల్ ట్రబుల్

Update: 2022-11-24 17:30 GMT
ఆపామని అనుకుంటున్నారా ఆగామని అనుకుంటున్నారా తగ్గేదే లే అంటూ అమరావతి రైతులు పాదయాత్రను రీస్టార్ట్ చేయబోతున్నారు. ఈ నెల 28 నుంచి మరోసారి పాదం కదిపి ఉత్తరాంధ్రా వైపుగా తరలిరానున్నారు.  ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అమరావతి జేయేసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.

ఎక్కడ నుంచి పాదయాత్ర ఆగిందో అక్కడ నుంచే తిరిగి మొదలెడతామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వద్ద పాదయాత్ర అక్టోబర్ 23న ఆగింది. ఆ తరువాత మళ్లీ చడీ చప్పుడూ లేదు. దాంతో పాదయాత్ర ఇక ఉండదు అని అంతా అనుకున్నారు. మరో వైపు సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ దశలో ఉంది. దాంతో న్యాయ స్థానం తీర్పు కోసం వేచి చూడడం బెటర్ అని అంతా భావిస్తున్న నేపధ్యంలో ఇపుడు రైతులు ఎందాకైన నడించేందుకు రెడీ అంటున్నారు.

అంతే కాదు కొత్త మాట కూడా చెప్పారు. సంఖ్యతో తమకు పనిలేదని అంటున్నారు. హై కోర్టు ఆరు వందల మందితో మాత్రమే పాదయాత్ర చేయమని పేర్కొంది. వారికి ఐడీ కార్డులు ఇవ్వమని పోలీసులను ఆదేశించింది. ఆ సంఖ్యకు మించి పాదయాత్రలో ఎవరూ ఉండవద్దు అని స్పష్టం చేసింది. అయితే పాదయాత్రకు సంఘీభావంగా మద్దతు ఇచ్చే వారు ఉంటారని వారిని కూడా తమతో కలుపుకుని పోతామని రైతులు పెట్టుకున్న  అభ్యర్ధనను హై కోర్టు పక్కన పెట్టేసింది.

ఆరు వందలు అంటే ఆరు వందలే అని తేల్చి చెప్పింది. ఇక వారికి పోలీసుల నుంచి ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా కోర్టుని ఆశ్రయించాలని కోరింది. దాంతో అమరావతి రైతులు తర్జన భర్జలను పడిన తరువాత ఇపుడు ఆరు వందల మందితోనే పాదయాత్రకు రెడీ అవుతున్నారు అని అంటున్నారు.  మరో వైపు పోలీసులకు మరోసారి పని పడినట్లు అయింది.

ప్రతీ రోజూ వారి ఐడీ  కార్డులను చెక్ చేసుకోవడం ఆరు వందల మందితో పాదయాత్ర సాగేలా చూడడం వారి విధి. ఇక మద్దతుదారులు రోడ్లకు ఇరు పక్కన నిలబడి మద్దతు ఇవ్వవచ్చు. మరి వారు అలా ఉంటారా లేక పాదయాత్రికులతో కలసి ముందుకు సాగుతారా అన్నది చూడాలి. ఇది అనుకున్నంత తేలిక కాదు.

అందువల్ల సపోర్ట్ చేసేవారిని విడదీసి పాదయాత్ర సజావుగా చూసే బాధ్యత పోలీసులదే. అంటే ప్రభుత్వానిదే. అదే టైం లో ఉత్తరాంధ్రాలో కూడా మూడు రాజధానులకు మద్దతుగా జేయేసీలు మళ్ళీ రీ సౌండ్ చేస్తాయేమో చూడాలి.

వారు కనుక పాదయాత్రను అడ్డుకుంటే ఇరు వర్గాలను సముదాయించి ముందుకు పాదయాత్ర కొనసాగేలా చూడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రాలో పాదయాత్ర విజయవంతం అయితే వైసీపీకి ఇరకాటం. అదే టైం లో విజయవంతం కాకుండా ఇబ్బందులు ఎదురై ఉద్రిక్తతలు చెలరేగితే ప్రభుత్వంగా ప్రభుత్వానికి  ఇబ్బంది అవుతుంది.

దాంతో వైసీపీ స్ట్రాటజీ ఏంటో ఎలా ఈ పాదయాత్ర అరసవెల్లి దాకా సాగుతుందో చూడాలి. ఏది ఏమైనా నెల రోజులకు పైగా ఆగి రీస్టార్ట్ చేస్తున్న పాదయాత్ర కాబట్టి అన్నీ ఆలోచించుకునే రైతులు దిగారని అంటున్నారు. మరి వారి వెనక విపక్షాలు ఉన్నాయని చెబుతున్న వైసీపీ రాజకీయంగానూ ఎదుర్కోవడానికి కొత్త ఎత్తులు ఏమి వేస్తుందో కూడా చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News