తెరపైకి మూడో ఎన్నికల కమిషనర్?

Update: 2020-06-02 07:10 GMT
ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ తిరిగి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియామకం అవుతారని అంతా భావించారు. కానీ హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వాలని కోరుతోంది. దీంతో నిమ్మగడ్డ నియామకం ఆగిపోయింది. జగన్ నియమించిన జస్టిస్ కనకరాజ్ కూడా హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషనర్ పోస్టును కోల్పోయారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎన్నికల కమిషనర్ పోస్టులో ఎవరిని నియమిస్తారనేది సుప్రీం కోర్టు తీర్పు, పర్యవసనాల అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఒకవేళ సుప్రీం స్టే ఇస్తే ఖాళీగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పాత నిబంధనల ప్రకారం మరో కొత్త కమిషనర్ ను ఏపీ ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు మధ్యలోనే ఆగిపోయాయి. రాజ్యాంగబద్దమైన ఎన్నికల కమిషనర్ పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచలేం.

దీంతో హైకోర్టు జగన్ సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేసిన నేపథ్యంలో పాత నిబంధనల ప్రకారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని, సీఎస్ స్థాయి కేడర్ లో రిటైర్డ్ అయిన వ్యక్తిని ఈ స్థానంలో నియమించాల్సి ఉంటుంది. ఈ మేరకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర కమిషనర్ కుర్చీలో కూర్చోనియకుండా అడ్డుకునేందుకు జగన్ సర్కార్ వ్యూహాలు పన్నుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఈ క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ను కొత్త కమిషనర్ గా నియమించాలని యోచిస్తోందట.. ఈ క్రమంలోనే రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ పేరు ఏపీ రాష్ట్ర కొత్త కమిషనర్ గా తెరపైకి వచ్చిందంటున్నారు. ఆయననే మూడో కమిషనర్ గా నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా మాత్రం ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. న్యాయపరమైన చిక్కులు చూసిన తర్వాతే దీనిపై ప్రభుత్వం ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News