అంత పెద్ద పేపర్ ఇలాంటి తప్పు చేస్తే ఎలా?

Update: 2020-02-08 16:46 GMT
కియా కంపెనీ తన ప్లాంట్ ను ఏపీ నుంచి తమిళనాడుకు తరలిస్తోందంటూ ప్రపంచంలోనే పేరెన్నికగన్న పత్రిక రాయిటర్స్ రాసిన కథనం నవ్యాంధ్రలో ఎంతటి రచ్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏపీలోని అనంతపురం జిల్లాలో కొరియాకు చెందిన కియా కార్ల కంపెనీ ఓ పెద్ద ప్లాంట్ నే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్లాంట్ నిర్మాణం పూర్తి కాగా... కార్ల ఉత్పత్తి కూడా ప్రారంభమైపోయింది. అంతేకాకుండా ఇండియాకు సంబంధించి ఈ ప్లాంట్ నుంచే కార్లను తయారు చేస్తామని కూడా కియా తెలిపింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో వార్తల విశ్వసనీయతలో ఓ రేంజి కలిగిన రాయిటర్స్... ఏపీలోని విపక్షం టీడీపీకి బాకా ఊదినట్టుగా కియా కంపెనీ తమిళనాడుకు తరలిపోతోందని కథనం రాయడమే పెద్ద తప్పే కదా. అందులోనూ ఈ వార్త రాసిన రాయిటర్స్ జర్నలిస్ట్... అటు కియా కంపెనీ ప్రతినిధులను గానీ - ఇటు ఏపీ ప్రభుత్వానికి చెందిన అధికారులను గానీ సంప్రదించకుండానే ఏదో గాలి వార్తలా అలా రాసి పారేశారు.

ఈ కథనాన్ని చూసిన వెంటనే... వైసీపీ సర్కారుపై విరుచుకుపడేందుకు నిత్యం సిద్ధంగా ఉన్న టీడీపీ నేతలు అందరూ ఒకేసారి బయటకు వచ్చేశారు. మీడియా మైకులు కనిపించగానే.. కియా తన ప్లాంట్ ను తమిళనాడుకు తరలించేస్తోందని, ఇందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరే కారణమని కూడా తమదైన శైలిలో రెచ్చిపోయారు. అంతటితో ఆ రచ్చ ఆగలేదు. ఏకంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ రాయిటర్స్ కథనాన్ని ముందు పెట్టుకుని మరీ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఏపీని సర్వ నాశనం చేస్తున్న జగన్ తీరుకు... కియా కార్ల కంపెనీ యూనిట్ తరలిపోతుండటమే నిదర్శనమన్నట్లుగా విమర్శలు గుప్పించారు. అసలు రాయిటర్స్ కథనంలోని అంశం వాస్తవమో - కాదో కూడా చూసుకోకుండా చంద్రబాబు ఓ రేంజిలో విమర్శలు గుప్పించారు. కియా ప్రతినిధులు సదరు కథనం తప్పని ప్రకటించినా కూడా శనివారం మరోమారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

తాజాగా రాయిటర్స్ ఎంట్రీ ఇచ్చింది. సదరు కథనం తప్పేనని తేల్చేసింది. అంతేకాకుండా తన తప్పును ఒప్పుకుని మరీ... ఆ కథనాన్ని తొలగిస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. అయినా రాజకీయాల్లో వైరి వర్గాలుగా ఉన్న రెండు పార్టీల నేతలు వాస్తవాన్నో - అవాస్తవాన్నో పట్టుకుని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే గానీ... వార్తల విశ్వసనీయతలో మేటిగా నిలిచిన రాయిటర్స్ పత్రిక ఇలాంటి అసత్య కథనాలను ఎలా రాస్తుందన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. అంతేకాకుండా తాను రాసిన కథనానికి ఆధారం కూడా లేకుండా సదరు పత్రిక కియా వార్తను ఎలా ప్రచురించిందన్నది కూడా ప్రశ్నార్థకమే. ఏ వార్త రాసినా... దానికి ఏ మేర ఆధారాలున్నాయని చూసుకున్న తర్వాతే కథనాలను ప్రచురించే తత్వమున్న రాయిటర్స్... కియా కథనం విషయంలో మాత్రం అవేవీ పట్టించుకోకుండానే అసత్య కథనాన్ని ప్రచురించడం చూస్తుంటే.. ఆ పత్రిక విశ్వసనీయత కూడా ప్రమాదంలో పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కియా తరలిపోతోందంటూ రాసిన కథనంతో... అంత పెద్ద పత్రిక కూడా ఇలాంటి వార్తలు రాస్తే ఎలా? అంటూ సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News