కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి `సీబీఐ అస్త్రం`..ఏం జ‌రిగిందంటే!

Update: 2021-09-09 11:13 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఒంటికాలిపై లేస్తున్న విప‌క్ష నాయ‌కుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సార‌థి.. రేవంత్‌రెడ్డి.. తాజాగా సీబీఐ అస్త్రాన్ని ప్ర‌యోగించారు. వాస్త‌వానికి టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ కేంద్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో.. జైలుకు వెళ్లి బెయిల్‌పై వ‌చ్చిన త‌ర్వాత‌.. చాన్నాళ్లు స‌వాళ్ల రాజ‌కీయం న‌డిచింది. కేసీఆర్‌ను గ‌ద్దె దింపే వ‌ర‌కు నిద్ర పోనంటూ.. అప్ప‌ట్లోనే రేవంత్ దూకుడుగా ముందుకు సాగారు. ఈ దూకుడుతోనే ఆయ‌న కాంగ్రెస్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సార‌థిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌..ఈ దూకుడును మ‌రింత పెంచారు. రాష్ట్రం లో ప్ర‌భుత్వం ఉందా? అంటూ.. నిల‌దీశారు. చుక్క‌-ప‌క్క‌-లెక్క రాజ‌కీయాలు సాగుతున్నాయంటూ.. కేసీఆ ర్‌పై విరుచుకుప‌డ్డారు. అంతేకాదు.. కేసీఆర్‌ను ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకునే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయం టూ.. విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ రెడ్డి అనేక అంశాల‌పై కేసీఆర్‌ను నిల‌దీశారు. ఇక‌, ఇప్పుడు తాజాగా.. కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేయ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతోంది.

ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రేవంత్‌రెడ్డి.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ ర్గం ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ పార్టీ కీల‌క నేత‌.. రాహుల్‌తో చర్చించి.. త్వ‌ర‌లోనే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌నున్నారు. అయితే..ప‌నిలో ప‌నిగా.. తెలంగాణ ప్ర‌భుత్వంపై రేవంత్ సీబీఐకి ఫిర్యాదు చేయ‌డం.. ఆస‌క్తిగా మారింది. ఇటీవల కేసీఆర్ ప్ర‌భుత్వం ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌భుత్వ అధీనంలో ఉన్న భూముల‌ను విక్ర‌యిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, ఇప్ప‌టికే కోకా పేట భూముల విక్ర‌యం కూడా జ‌రిగిపోయింది. ఆదిలో ఈ విక్ర‌యాల‌ను అడ్డుకున్న ప్పటికీ.. కోర్టు అనుమ‌తి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌బుత్వం ఈ విక్ర‌యాల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తోంది. అయితే.. ఈ విక్ర‌యాల్లో.. అవినీతి జ‌రుగుతోంద‌ని.. ప్ర‌భుత్వం పేరు చెప్పి కేసీఆర్ సొమ్ములు నొక్కేస్తున్నార‌ని.. రేవంత్ స‌హా బీజేపీ నాయ‌కులు కూడా విమ‌ర్శించారు. బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ స‌హా కొంద‌రు కాళేశ్వ‌రంలో సొమ్ములు చేసుకున్నార‌ని.. కేసీఆర్‌ను జైలుకు పంపే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఎవ‌రూ సీబీఐ వంటి సంస్థ‌ల‌కు ఫిర్యాదు చేసిన ప‌రిస్థితి లేదు.

కానీ, ఇప్పుడు రేవంత్ మాత్రం కోకాపేట భూముల విష‌యంలో 1500 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని.. దీనిలో అధికారుల‌కు కూడా ప్ర‌మేయం ఉంద‌ని పేర్కొంటూ.. సీబీఐ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణం పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తన ఫిర్యాదు లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కుంభకోణాల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదు పేర్కొన్న రేవంత్‌ రెడ్డి. కెసిఆర్ సన్నిహితులు ఉన్నతాధికారులు భూములు దక్కించుకున్నారని ఆరోపణలు చేశారు.

అధికార బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి అప్పాయింట్ మెంట్‌ కోరానని రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసిఆర్ అవినీతి పై చర్యలు తీసుకోవడంలో అధికార బీజేపీ పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని ఆయన సవాల్‌ విసిరారు. మ‌రి ఈ ప‌రిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి. ఏదేమైనా.. రేవంత్ వ‌ర్సెస్ కేసీఆర్ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




Tags:    

Similar News