కేసీఆర్ మెచ్చిన కలెక్టర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Update: 2021-11-17 02:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డిని రాజీనామా చేయించి మరీ ఎమ్మెల్సీని చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి బంధంపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న వెంకటరామిరెడ్డితో రాజీనామా చేయించి  మరీ ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

వెంకటరామిరెడ్డి రాజీనామాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ ను తిరస్కరించి చట్టమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ కు వెంకటరామిరెడ్డి బంట్రోతుగా పనిచేశారని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

ఇక ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకరలు తిప్పడం వెనుక వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణ నుంచి అప్పట్లో వెంకట్రామిరెడ్డి తప్పించుకున్నారని తెలిపారు. వెంకటరామిరెడ్డిని కేసీఆర్ ఇంత ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీని చేస్తున్నారని విమర్శించారు.

అందరు ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ గా కేసీఆర్ నియమించారని రేవంత్ రెడ్డి అన్నారు.

సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంకట్రామిరెడ్డిలో ఉందన్నారు. వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. దక్కన్ ఇన్ ఫ్రాస్టక్చర్ వివరాలు దొరకడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వెంకట్రామిరెడ్డిపై జరిమానా విధించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Tags:    

Similar News