రాహుల్ ను అస్త్రంగా వాడేస్తున్న రేవంత్ రెడ్డి

Update: 2021-08-21 02:43 GMT
అధికారం కావాలి. కానీ.. అందుకు అవసరమైన ప్రయత్నాలు చేయరు. ఎవరి కుంపటి వారు పెట్టుకొని.. నిత్యం ఏదో ఒక మంట పెట్టి తమ అధిక్యతను ప్రదర్శించుకోవాలన్న తత్త్వం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ.. సోనియమ్మ ఆ నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణలో శాశ్వితంగా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నంతగా బిల్డప్ ఇవ్వటం.. తీరా చూస్తే.. ఉనికికే ప్రమాదంగా మారిన పరిస్థితి రావటం తెలిసిందే. దీనంతటికి కారణం పార్టీలోని సీనియర్లేనన్న మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది.

పార్టీలో తమకు పెద్ద పీట వేయాలని.. పదవులు ఇవ్వాలంటూ పేచీలు పెట్టుకునే నేతలు పలువురు.. అందుకు భిన్నంగా పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రం ప్రయత్నించని పరిస్థితి. దీంతో.. తరచూ ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అంతకంతకూ తన ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్..తిరిగి తన పూర్వపు బలాన్ని తెచ్చుకునేందుకు ఈ మధ్యనే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయటం తెలిసిందే.

తన పదవీ ప్రమాణస్వీకారాన్ని తన రాజకీయ ప్రత్యర్థులు సైతం కుళ్లుకునేలా చేసిన ఆయనకు అండగా ఉండటానికి బదులుగా.. సహాయ నిరాకరణ చేస్తున్న కాంగ్రెస్ నేతలు పలువురు ఉన్నారు. తాము చేయరు.. చేసినోళ్లకు దన్నుగా నిలవని నేతల తీరుతో రేవంత్ కిందా మీదా పడుతున్నారు. ఎంతగా నచ్చ జెప్పినా.. చివరకు వారిని నేరుగా కలిసి.. సహకారం అందించాలన్న అప్పటికి ఓకే అని చెబుతూ.. వెనుక గోతులు తవ్వే బ్యాచ్ పెద్దదే అన్న విషయాన్ని గుర్తించిన రేవంత్.. తాజాగా ఒక ప్లాన్ వేశారని చెబుతున్నారు.

ఇప్పటివరకు కలిసి రాని సీనియర్లు దెబ్బకు దారికి వచ్చేలా తాజా ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దళిత.. గిరిజన దండోరా సభల్ని నిర్వహిస్తూ... తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన వరంగల్ లో భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు పార్టీ కీలక నేత రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. మాట వరుసకు రేవంత్ ఈ మాట అన్నాడా? అన్న సందేహం వచ్చిన వారు రాష్ట్ర పార్టీ బాధ్యులు మాణిక్యం ఠాగూర్ ను క్రాస్ చెక్ చేస్తే..ఆయన సైతం అవునన్న మాట వచ్చింది.

దీంతో.. రాహుల్ వస్తున్నారన్న మాటతో వరంగల్ సభ మీద కొత్త అంచనాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ బహిరంగ సభకు రాహుల్ ను పిలిపించటం ద్వారా రేవంత్ భారీ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. రాహులే స్వయంగా సభకు వస్తున్న వేళలో.. తనకు సహకారం అందించకుండా.. తాను పెట్టే సభలకు గైర్హాజరు అవుతున్న వేళ.. రాహుల్ స్వయంగా సభకు రావటంతో డుమ్మా కొట్టే నేతలంతా చచ్చినట్లుగా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే.. రెండు..మూడుసార్లు వచ్చాక అదో అలవాటుగా మారిపోతుందని.. కాంగ్రెస్ నేతల మధ్య ఐకమత్యం వెల్లివిరిస్తుందన్న సంకేతాలు పార్టీకి మేలు చేస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే రాహుల్ ను సీనియర్ల మీదకు ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు. రేవంత్ కొట్టిన ఈ మాస్టర్ స్ట్రోక్ తనను పక్కన పెట్టాలని చూసే వారిని కొడుతున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.





Tags:    

Similar News