తెలంగాణ‌లో మ‌రో ల‌గ‌డ‌పాటి..పోలీసుల క‌ళ్లు గ‌ప్పిన రేవంత్‌ రెడ్డి..!

Update: 2019-10-21 09:48 GMT
రేవంత్‌ రెడ్డి. తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిలో దుకుడుమీదున్న యువ నాయ‌కుడు. అధికార పార్టీ పైనా - సీఎం కేసీఆర్‌ పైనా త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్న నాయ‌కుడు. తాజ‌గా ఆర్టీసీ స‌మ్మెలో భాగంగా కార్మిక యూనియ‌న్ ఇచ్చిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ (సీఎం కేసీఆర్ అధికారిక నివాసం) ముట్ట‌డి కార్య‌క్ర‌మం.. సోమ‌వారం జ‌రిగింది. అయితే, ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నాయ‌కుల‌ను - యూనియ‌న్ నేత ల‌ను కూడా ఎక్క‌డిక‌క్క‌డే నిలువ‌రించారు. కొంద‌రిని గృహ నిర్బంధం చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు వెళ్లే దారుల‌ను కూడా మూసివేశారు.

అయితే, ఇంత‌లా పోలీసులు క‌ట్టుదిట్టం చేసినా.. కాంగ్రెస్ ఎంపీ - పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాత్రం త‌న‌దైన దూకుడు ను ప్ర‌ద‌ర్శించారు. 2012కు ముందు ఏపీలో స‌మైక్య ఉద్య‌మం సాగిన స‌మ‌యంలో విజ‌య‌వాడ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అనుస‌రించిన పంథానే తాజాగా రేవంత్ కూడా అనుస‌రించాడు. అప్ప‌ట్లో పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించినా.. ల‌గ‌డ‌పాటి పోలీసుల క‌ళ్లుగ‌ప్పి రాజ‌ధాని హైద‌రాబాద్‌కు చేరుకున్నారు.

ఫ‌క్తు అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పోలీసుల క‌ళ్ల‌ గ‌ప్పి.. అనేక నిర్బంధాల‌ను దాటుకుని మ‌రీ ..కేసీఆర్ నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు. వాస్త‌వానికి రాత్రి నుంచి కూడా పోలీసులు రేవంత్ ను ప‌ట్టుకునేందుకు - నిర్బంధించేందుకు శ‌త విధాల ప్ర‌య‌త్నించారు. పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడిన రేవంత్ రెడ్డి తన అనుచరలతో కలిసి నల్ల చొక్క ధరించి ఆకస్మి కంగా ప్రగతి భవన్ సమీపంలోకి వచ్చారు. దీంతో..ఒక్క సారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆయన్ను అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో..రేవంత్ అనుచరులు పోలీసులను అడ్డుకొనే ప్రయత్నం చేసారు.

అయినా.. రేవంత్ ముందకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున పోలీసులు రేవంత్ ను చుట్టుముట్టి..అడ్డుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి స్వయంగా నినాదాలు చేశారు. ఇప్పు డు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ లోకి దూసుకువ‌చ్చామ‌ని - త్వ‌ర‌లోనే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను కూల‌దోస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. మొత్తంగా చూస్తే.. ఆర్టీ సీ కార్మికుల స‌మ్మె తీవ్ర రూపం దాల్చ‌డం - రేవంత్ రెడ్డి వంటి నాయ‌కులు దూకుడుగా ఉండ‌డంతో కేసీఆర్‌ కు చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


Full View

Tags:    

Similar News