ఆరంభం అద్దిరిపోవాలె.. ఓ రేంజ్ లో రేవంత్ ప్ర‌మాణం!

Update: 2021-07-06 02:30 GMT
ఇప్పుడు రాజ‌కీయాల్లో న‌డుస్తున్న‌ ట్రెండ్ ఏమంటే.. సంచ‌ల‌నం. ఏం మాట్లాడినా సెన్సేష‌న్‌ కావాలి. ఏం చేసినా సంచ‌ల‌నం కావాలి. త‌ద్వారా.. ప్ర‌జ‌ల చూపు త‌మ వైపు తిప్పుకోవాలి. తోపు లీడ‌ర్ అనిపించుకోవాలి. ఇందులో రెండాకులు ఎక్కువే చ‌దివారు రేవంత్ రెడ్డి.

ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్‌.. ఈ కార‌ణంతోనే పీసీసీ కిరీటం సాధించారంటే అతిశ‌యోక్తి కాదు. దీంతో.. పార్టీ ప‌రిస్థితి మారుతుందా అని కాంగ్రెస్ శ్రేణులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తాడు అని ప్ర‌త్య‌ర్థులు ఆస‌క్తిగా గమ‌నిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆ టెన్ష‌న్ ను అలాగే కొన‌సాగించేందుకు ప‌క్కా ప్లాన్ వేస్తూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి.

రేవంత్ కు పీసీసీ రావ‌డం ప‌ట్ల‌.. సీనియ‌ర్లుగా ఉన్న‌వారంతా సీరియ‌స్ గా ఉన్నార‌న్న సంగ‌తి తెలిసిందే. బ‌య‌ట‌కు క‌నిపించ‌క‌పోయినా.. లోప‌ల మాత్రం ర‌గిలిపోతున్నార‌నే విష‌యం కూడా తెలిసిందే. దీంతో.. ప్ర‌క‌ట‌న రాగానే.. వారిని కూల్ చేసే ప‌నిలో ప‌డ్డాడు. వ‌రుస‌గా సీనియ‌ర్లంద‌రినీ క‌లిసి వారి అహం చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేశాడు. దాదాపుగా అంద‌రినీ సెట్ చేసిన‌ట్టే.

అయితే.. ఇప్పుడు ప్ర‌మాణ స్వీకారంపై దృష్టి పెట్టారు. సాధార‌ణంగా ఫొటోకు ఫోజిచ్చేలా కాకుండా.. ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నేత‌ల‌ను పిలిచి మ‌రీ గ్రాండ్ గా గాంధీ భ‌వ‌న్లోకి అడుగు పెట్టాల‌ని చూస్తున్నారు. ఈ మేర‌కు ఇత‌ర రాష్ట్రాల్లోని నేత‌లను సైతం ఆహ్వానిస్తున్నారు.

ఇందులో భాగంగానే.. క‌ర్నాట‌క నుంచి ప‌లువురు నేత‌ల‌ను పిలిచారు. క‌ర్నాట‌క వెళ్లిన రేవంత్ అక్క‌డి పీసీసీ చీఫ్ శివ‌కుమార్ ను క‌లిసి, ప్ర‌మాణ స్వీకారానికి రావాల‌ని కోరారు. మ‌రో సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేను క‌లిసి ఆయ‌న్ను కూడా ఆహ్వానించారు. మాజీ సీఎం సిద్ధా రామ‌య్య‌ను కూడా రావాల్సిందిగా కోరారు. ఇక‌, అధిష్టానం నుంచి ఎవ‌రైనా రావొచ్చ‌ని అంటున్నారు.

మొత్తానికి ఎల్లుండి జ‌ర‌గ‌బోయే ప్ర‌మాణ స్వీకారోత్స‌వం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంద‌ని క‌న్ఫామ్ అయ్యింది. మ‌రి, ఆ వేదిక నుంచి రేవంత్ ఏం మాట్లాడ‌తారు? కేసీఆర్ పై ఎలాంటి యుద్ధం ప్రకటిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News