రేవంత్ స‌వాల్‌ - లోకేష్ పంచ్‌ లు

Update: 2016-01-12 16:21 GMT
నిజాం కాలేజీ గ్రౌండ్స్‌ లో టీడీపీ-బీజేపీ బహిరంగ సభతో గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని లాంచ‌నంగా ప్రారంభించిన ఆయా పార్టీల నేత‌లు కీల‌క ప్ర‌సంగాలు చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ టీడీపీ ఫైర్‌ బ్రాండ్‌ మ్మెల్యే రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్ స‌వాల్‌ కు ప్ర‌తి స‌వాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, 20 నెలల్లో టీఆర్‌ ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. సమిష్టి కృషితోనే తెలంగాణ సాధ్యమైందని, ఏ ఒక్కరి వల్లో తెలంగాణ ఏర్పడలేదని ఉద్ఘాటించారు. తామెంతో చేశామ‌ని చెప్తున్న టీఆర్‌ ఎస్‌ పార్టీ గ్రేటర్‌ ఎన్నికల్లో 100 సీట్లు గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా సవాల్‌ చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఉత్తేజ‌పూరిత ప్ర‌సంగంతో త‌నదైన శైలిలో ఆహుతుల‌ను ఆక‌ట్టుకున్నారు. హైదరాబాద్‌ లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు హైదరాబాద్‌ నగరంలో అంతగా అభివృద్ధే జరగలేదన్నారు. హైద‌రాబాద్‌ లో కేసీఆర్ నిర్మించిన స్కైవేలు టీఆర్ ఎస్ నాయ‌కుల‌కు క‌నిపిస్తున్నాయేమో కానీ ప్ర‌జ‌ల‌కు మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌టం లేద‌న్నారు. మాయమాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ సర్కార్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని  పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్‌ నెరవేర్చారా అని ప్రశ్నించారు. తాను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌ లోనేన‌ని ప్ర‌క‌టిస్తూ ఇక్క‌డే ఉంటూ హైద‌రాబాద్ అభివృద్ధిలో భాగ‌స్వామ్యం అవుతామ‌ని చెప్పారు. హైద‌రాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కేంద్రం సాయంతో హైదరాబాద్‌ ను మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు. 2019లో తెలంగాణలో గెలుపునకు గ్రేటర్‌ ఎన్నికలు పునాది కావాలని ఉద్ఘాటించారు.
Tags:    

Similar News