కోమటిరెడ్డి సస్పెండ్ వద్దు అని చెప్పిన రేవంత్ రెడ్డి

Update: 2022-07-26 08:34 GMT
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపార్‌రెడ్డి కాక రేపుతున్నారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇప్పుడు సొంత పార్టీకే కొరకరాని కొయ్యలా మారారు. సొంత పార్టీపైన, సోనియాగాంధీ ఈడీ విచారణపైనా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా టీపీసీసీ చర్యలకు వెనుకాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రెండేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రెండు మూడేళ్లుగా సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 2020లోనే ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. 2021లలో మరోమారు తాను పార్టీ మారితే బీజేపీలోనే చేరుతానని ప్రకటించారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో పిలుపునిచ్చిన నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తాజాగా ఐదు రోజులుగా రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

-పీసీసీ పగ్గాలు రేవంత్‌కు అప్పగించాక..

టీపీసీసీ పగ్గాలను ఏడాది క్రితం కాంగెస్‌ అధిష్టానం రేవంత్‌రెడ్డికి అప్పగించింది. అప్పటి వరకు రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టీపీసీసీ రేసులో నిలిచారు. కానీ, అధిష్టానం రేవంత్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. దీంతో రాజగోపాల్‌రెడ్డిలో అసంతృప్తి కట్టలు తెంచుకుంది. రేవంత్‌ టార్గెట్‌గానే తరచుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.

-అసెంబ్లీలో మద్దతుగా నిలవని సొంత పార్టీ ఎమ్మెల్యేలు...

కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ అజెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా విమర్శల దాడి చేశారు. కాంట్రాక్టర్‌ అంటూ వ్యక్తిగతంగా దూషించినంత పనిచేశారు. అప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ రాజగోపాల్‌రెడ్డికి అండగా నిలవలేదు. అధికార పార్టీ వ్యాఖ్యలను ఖండించలేదు. దీంతో అప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్‌పై ఉన్న కాస్త నమ్మకం కూడా రాజగోపాల్‌రెడ్డికి పోయిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. అప్పటి నుంచి పూర్తిగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు.

-అమిత్‌షాతో టచ్‌లోకి..

తాజాగా రాజగోపాల్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఢిల్లీలో కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, టీఆర్‌ఎస్‌ పాలన, అవినీతి, అప్పుల వ్యవహారంతోపాటు బీజేపీలో చేరే అంశంపై కూడా చర్చించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు ఆయన హాట్‌ టాపిక్‌గా మారారు. అన్ని రాజకీయ పార్టీల దృష్టి మునుగోడు నియోజకవ్గగంవైపు మళ్లింది.

-బుజ్జగింపుకు విఫలయత్నం

రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమంటూ వచ్చిన వార్తలకు సోమవారం విరణ ఇచ్చే సమయంలో సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేయడాన్ని ప్రస్తావించారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే రాష్ట్రంలో టీఆరెస్‌ను మట్టి కరిపించే సత్తా ఉంది’ అని చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేరుగా రాజగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. సుమారు రెండు గంటలపాటు మంతనాలు సాగించారు. పార్టీ వీడొద్దని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి ఫలితం కానరాలేదు. సమావేశం ముగిసిన తర్వాత ఎవరి దారి వారిది అంటూ భట్టి చేసిన వ్యాఖ్యలు రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడడం ఖాయమన్న వార్తలకు బలం చేకూర్చాయి.

-ఖండనలకూ దూరం..

రాజగోపాల్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ వీడియో, క్లిప్పింగ్‌లను  పరిశీలించిన కాంగ్రెస్‌ అధిష్టాటనం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను రాష్ట్ర నాయకులెవరూ ఖండంచడం లేదు. ఆయనపై చర్య తీసుకోవాలని కూడా ఎవరూ పార్టీ అధిష్టానాన్ని కోరడం లేదు. రాజగోపాల్‌రెడ్డి కుటుంబం సోనియాగాంధీకి అత్యంత విధేయతగా ఉండడం, మంచి సంబంధాలు కొనసాగించడంతోనే కాంగ్రెస్‌ నాయకులు మౌనం వహిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తేనే  చర్యలు తీసుకోవావలని రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News