మీడియా.. వైఎస్ఆర్ .. ఓ రేవంత్ రెడ్డి సంకల్పం

Update: 2023-01-04 13:30 GMT
అది చంద్రబాబు సీఎంగా ఉన్న రోజులు.. 2004కు ముందు రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉంది. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి మరీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. మీడియా మొత్తం చంద్రబాబు వెంట ఉన్నా.. వైఎస్ఆర్ ను విలన్ గా ప్రొజెక్ట్ చేసినా కూడా ఆయనను ప్రజలు ఆదరించారు. మళ్లీ గెలిపించారు. ఇప్పుడు ఆ నమ్మకమే తమను గెలిపిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ బోయినపల్లిలో ఉన్న గాంధీ ఐడియాలజీ సెంటర్ లో పీసీసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధరణి పోర్టల్ పై పార్టీ నేతలకు అవగాహన కల్పించడంతోపాటు జనవరి 26న ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడోయాత్రలు, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా అమలు, ఎన్నికల నిబంధనపై చర్చించనున్నారు. ఈ సమావేశం సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ మాట్లాడుతూ.. ‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మీడియా మొత్తం సపోర్టు చేసినా దివంగత సీఎం వైఎస్ఆర్ ను ఏమీ చేయలేకపోయారు. ఏ మీడియా కూడా ప్రభుత్వాన్ని శాసించలేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం.. అధికారం సాధించే దిశగా పనిచేద్దాము.. దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్నా ప్రధాని మోడీ స్పందించడం లేదు. అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పడం దురాక్రమణలకు అనుమతి ఇచ్చినట్లే అవుతుంది. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా పదవి స్వీకరించలేదు. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారు. చలిని సైతం లెక్కచేయకుండా రాహుల్ భారత్ జోడోయాత్ర చేస్తున్నారు.

రాష్ట్రంలో 2003లో ఎలాంటి విపత్కర సమస్యలు ఎదుర్కొన్నారో 2023లో అలాంటి పరిస్తితులే ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. అందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదు అంటూ రేవంత్ తన శ్రేణులకు భరోసానిచ్చారు.

నిజానికి 2003లో దివంగత మహానేత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర ఒక సంచలనమనే చెప్పాలి.  మీడియా మొత్తం వ్యతిరేకంగా ఉన్నా ఇందిరమ్మ రాజ్యం తెస్తానని వైఎస్ఆర్ బయలుదేరారు. పాదయాత్రతో వైఎస్ఆర్ సమూల మార్పులు తీసుకువచ్చారు. ఎంతోమంది వైఎస్ఆర్ పాదయాత్రలో భాగస్వాములయ్యారు. కాంగ్రెస్ ను అధికారం దిశగా నడిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయాలని.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News