'టీ'లో మలిదశ ఉద్యమం అంటున్నాడు

Update: 2015-04-11 06:52 GMT
తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికే ఉండవన్నట్లుగా ఉంది తెలంగాణ తెలు గుదేశం నేత రేవంత్‌రెడ్డి వ్యవహారం. ప్రతి విషయంలోనూ ఏదో ఒక లోపం వెతికి.. తెలంగాణ అధికారపక్షాన్ని తిట్టిపోయటమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తాజాగా అధికారపక్షంపై మరోసారి విరుచుకుపడ్డారు.

తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌  కుటుంబానికి చెందిన నలుగురు మాత్రమే సంతోషంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మిగిలిన వర్గాలన్నీ పలు సమస్యలతో సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు. పలు వర్గాలు వివిధ సమస్యలతో ఉన్నారని.. ఇలాంటి వారందరి కోసం తెలంగాణ మలిదశ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

అధికారపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆయన దళితుల్ని సీన్లోకి తీసుకొచ్చారు. పూలే జయంతిని పట్టించుకోవటం లేదని.. అంబేడ్కర్‌ ఉత్సవ కమిటనీని దళితులకు అప్పగించలేదని వ్యాఖ్యానించారు.

బతుకమ్మ పండక్కి రూ.10కోట్లు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దళితుల విషయంలో మాత్రం ఉదాసీనంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అన్నామంటే అన్నారంటారు కానీ.. అంబేడ్కర్‌ జయంతికి ఏపీలోని టీడీపీ సర్కారు ఎన్ని నిధులు విడుదల చేసింది?

తెలంగాణలో బతుకమ్మకు నిధులు విడుదల చేస్తే.. చంద్రబాబు సంక్రాంతికి చంద్రన్న కానుక అంటూ వందల కోట్లు ఖర్చు చేశారు. అలాంటప్పుడు దళితుల ఆరాధ్యదైవం అంబేడ్కర్‌ విషయంలో ఏపీ సర్కారు భిన్నంగా ఏమీ ప్రవర్తించ లేదు కదా. అలాంటప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి.. మాట్లాడటంలో అర్థం ఏమైనా ఉందా? ఉత్తపుణ్యానికే తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టటమే పనిగా పెట్టుకుంటే దాని వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ. ఎప్పుడూ తిట్టే వారిని ఎవరూ పట్టించుకోరన్న విషయం రేవంత్‌ మర్చిపోతున్నట్లున్నారే?

Tags:    

Similar News