మును'గౌడ్'.. వారే డిసైడర్.. చెరుకు పై సరైన దిశలో రేవంత్!

Update: 2022-08-05 23:30 GMT
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రం మొత్తం ఈ ఎన్నికపైనే చూపు నిలిపింది. మూడు నెలల్లోపే ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ అప్రమత్తం అయ్యాయి. కాంగ్రెస్ సిట్టింగ్ శాసన సభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున అభ్యర్థిగా దిగడం ఖాయమే. ఇక మిగిలింది కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదే. కాంగ్రెస్ కు దశాబ్దాలుగా పట్టున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఆ పార్టీ ఎవరిని నిలుపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఆర్థిక, అంగ బలం ఉన్నందున అభ్యర్థి ఎంపిక సమస్య కాబోదు. అయితే, రాజకీయాల్లో ఎవరెంత చెప్పినా సామాజిక సమీకరణాలే కీలకం. ఆ ప్రకారం చూస్తే మునుగోడు నియోజకవర్గంల గౌడ సామాజిక వర్గం వారి సంఖ్య చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే.. అభ్యర్థి ఏ పార్టీ వారైనా.. గెలుపోటములను నిర్ణయించేంది ఈ సామాజిక వర్గం వారే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రస్తుతానికి అభ్యర్థి విషయంలో 100 శాతం సరైన దారిలో వెళ్తోంది. దీని వెనుక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చురుకైన పాత్ర పోషించడం విశేషం.


అన్నిచోట్ల 50శాతం.. మునుగోడులో 60 శాతం

తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో వెనుకబడిన వర్గాల (బీసీ) శాతం 50 పైనే ఉంటుంది. మునుగోడులో మాత్రం అది 60 శాతంపైనే కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2.15 లక్షల ఓట్లు ఉన్నాయనుకుంటే దాదాపు 60 వేల ఓట్లు గౌడ్ సామాజికవర్గం వారివే. అంటే.. వీరి ఎటు మొగ్గితే అటు విజయం. గౌడ్ ల తర్వాత పద్మశాలీల సంఖ్య ఎక్కువ. ఆ తర్వాత యాదవ్, దళితులు ఉన్నారు. దీనిప్రకారం పార్టీలు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలో కీలక సామాజిక సమీకరణాలను పట్టించుకునే వీలుంది. మరోవైపు గౌడ్ లకు తప్పక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

చురుగ్గా స్పందించి.. చెరుకును చేర్చుకుంటూ

మునుగోడు సామాజిక సమీకరణాలను అంచనా వేసుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చురుగ్గా స్పందించారనే చెప్పాలి. అందరికంటే ఓ మెట్టు ముందున్న ఆయన తెలంగాణ ఇంటి పార్టీ విలీనం అయ్యేలా చేశారు. ఈ పార్టీ వ్యవస్థాపకుడు క్టర్ చెరుకు సుధాకర్.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వైద్యుడైన ఆయన ఉద్యమంలో పాల్గొన్నందుకు పీడీ చట్టం కింద జైలుకెళ్లి ఆరు నెలలు శిక్ష అనుభవించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మునుగోడు టిక్కెట్ ఆశించారు. కానీ, అది దక్కలేదు. దీంతో తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు.

చెరుకుకు టిక్కెట్ దక్కొచ్చేమో?

రేవంత్ ప్రత్యేక శ్రద్ధ చూపి డాక్టర్ చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. గురువారం రేవంత్ తో పాటే సుధాకర్ ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో కండువా కప్పించుకుని తెలంగాణకు తిరిగి రావాలని సుధాకర్ భావిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం డాక్టర్ చెరుకు సుధాకర్ కు మనుగోడు టిక్కెట్ దక్కొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే.. సంస్థాగత బలానికి తోడు సామాజిక వర్గ బలం తోడై కాంగ్రెస్ మునుగోడులో విజయం సాధించడం ఖాయమే. అంతేగాక డాక్టర్ సుధాకర్ భార్య దళితురాలు. ఆయనకు టిక్కెట్ దక్కితే.. రెండు సామాజికవర్డాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది.
Tags:    

Similar News