ఉత్తమ్ కు షోకాజ్ నోటీసులు జారీ అవుతాయా?

Update: 2019-09-19 06:50 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో చిచ్చు రాజుకుంది. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బై పోల్ కు సంబంధించి రచ్చ రేగుతూ ఉంది. ఈ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తన భార్య పద్మావతి పోటీ చేస్తుందని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించుకున్నారు. తను పీసీసీ అధ్యక్షుడు కావడం - అది కూడా మొన్నటి వరకూ ఆ సీటుకు తనే ప్రాతినిధ్యం వహించి ఉండటంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటన చేసుకున్నట్టుగా ఉన్నారు.

అయితే ఈ విషయంపై కాంగ్రెస్ నుంచి అసహనం వ్యక్తం అవుతూ ఉంది. ప్రత్యేకించి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా ఎలా అభ్యర్థిని ప్రకటించుకుంటారని ఆయన బాహాటంగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం సూచనలు - ఆదేశాలు లేకుండా ఉత్తమ్ ఎలా తనే ప్రకటిస్తారంటూ రేవంత్ అంటున్నారు.

హుజూర్ నగర్ నుంచి తను చెప్పిన వారిని పోటీ చేయించాలని రేవంత్ భావిస్తూ ఉన్నట్టున్నాడు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనపై ఆయన గరం అవుతూ ఉన్నాడు. ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ  చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉండటం  గమనార్హం.

అలాగే  అభ్యర్థిత్వం ప్రకటించే విషయంలో అధిష్టానం ఉత్తమ్ ప్రకటనను రద్దు చేయాలని.. అధిష్టానమే అభ్యర్థిని ప్రకటించాలని.. రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరి ఈయన డిమాండ్ మేరకు టీపీసీసీ అధ్యక్షుడికి షోకాజ్ నోటీసు జారీ అవుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

   

Tags:    

Similar News