ఎట్ట‌కేల‌కు రేవంత్‌ కు కాంగ్రెస్ ఊర‌ట‌నిచ్చింది

Update: 2018-05-06 04:51 GMT
ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హ‌స్తం పార్టీ షాకుల మీద షాకులు ఇస్తున్న ఎపిసోడ్ నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న‌ప్ప‌టికీ...తన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను మ‌రింత దీటుగా ఎదుర్కోవాల‌నే ఉద్దేశంతో...ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌ లో చేరిన రేవంత్‌కు అందులో ద‌క్కింది ఏంట‌నే సందేహం అన్నివ‌ర్గాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. పార్టీలో చేరిక‌ల సంద‌ర్భంగా ముందుగా హామీ ఇచ్చిన ప్ర‌చార క‌మిటీ అనే ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌ని కాంగ్రెస్‌...కొద్దికాలం క్రితం ఆయ‌న పాద‌యాత్ర‌కు కూడా బ్రేకులు వేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అదిష్టానం అందుకు నో చెప్పింది. వ్యక్తిగత పాదయాత్రలు వద్దని అధినేత రాహుల్‌ గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో షాక్ తిన‌డం రేవంత్ వంతు అయింది. ఇలా రేవంత్ దూకుడుకు బ్రేకులు వేసేలా చేసిన కాంగ్రెస్ ఆయ‌న్ను గౌర‌వించ‌క‌పోయినా...గుర్తించింది. రేవంత్ వ‌ర్గం నాయ‌కురాలు వరంగల్‌ జిల్లా ములుగు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డి అనసూయ(సీతక్క)ను కాంగ్రెస్‌ జాతీయ మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. దీంతో ఆయ‌న టీం ఊపిరి పీల్చుకుంటోంది.

రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ ప్ర‌కారం స్వ‌ల్ప‌కాలంలోనే విశేష గుర్తింపు ఇచ్చిన‌ప్ప‌టికీ...టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వదులుకొని మ‌రీ రేవంత్ కాంగ్రెస్‌ లో చేరారు. ఆయ‌న చేరిక స‌మ‌యంలో కాంగ్రెస్‌ లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ లభిస్తుందని, పార్టీ హామీ లభించిన తర్వాతే కాంగ్రెస్‌ లో చేరినట్లు ప్ర‌చారం జ‌రిగింది. రేవంత్‌ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క - వేం నరేందర్ రెడ్డి - బోడ జనార్ధన్ స‌హా పలువురు ముఖ్య నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఆ పార్టీలో వారికి  ఎలాంటి గౌర‌వం ద‌క్క‌లేదు. రేవంత్ రెడ్డి త‌న‌తో పాటు తన వెంట వచ్చిన ముఖ్యులకు సముచిత స్థానం కల్పించాలన్న డిమాండ్ పార్టీ ముందు పెట్టిన‌ప్ప‌టికీ అది ఫ‌లితం ఇవ్వ‌లేదు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన నేత‌ల్లో ఆశ‌లు చిగురించాయి. అయితే అదేమీ జ‌ర‌గ‌లేదు.దీంతో తెలంగాణ టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అదే స‌మ‌యంలో రేవంత్ పాద‌యాత్ర‌కు కూడా బ్రేకులు వేయ‌డంతో ఆయ‌న వెంట వ‌చ్చిన నాయ‌కులు నీరుగారిపోయారు.

పార్టీ కార్యాక్ర‌మాల్లో కూడా రేవంత్ టీం పెద్ద‌గా పాల్గొన‌లేదనే టాక్ ఉంది ఇలాంటి చ‌ర్చోపచ‌ర్చ‌ల నేప‌థ్యంలో తాజాగా కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. రేవంత్‌తో పాటు టీడీపీకి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌ లో చేరిన ములుగు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డి అనసూయ(సీతక్క)ను కాంగ్రెస్‌ జాతీయ మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లట్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజన సామాజిక వర్గానికి(కోయ) చెందిన ఆమెకు ఈ పదవి రావడం పట్ల కాంగ్రెస్‌ వర్గాలు అభినందనలు తెలిపాయి. ముఖ్యంగా త‌మ‌కు పెద్ద ఉప‌శ‌మ‌నం ద‌క్కిన‌ట్ల‌యింద‌ని రేవంత్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.
Tags:    

Similar News