బాబు-రేవంత్ ఫిక్సింగ్‌ లో ఇది మొద‌టిది

Update: 2018-09-07 14:13 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు మారుతున్నాయి. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా...ఎన్నిక‌ల ఎపిసోడ్ అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఊహించ‌ని వేగంతో టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ ముంద‌స్తును ముందుకు తెచ్చిన నేప‌థ్యంలో విపక్షాలు త‌మ అస్త్రాల‌కు ప‌దునుపెడుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎపిసోడ్‌లో మ‌రో కీల‌క ముంద‌డుగు వేసింది. రాబోయే ఎన్నిక‌లను ఎదుర్కునేందుకు కావాల్సిన పొత్తుల ప్ర‌క్రియ‌కు సంబంధించి క‌మిటీ వేసింది. అయితే, ఈ క‌మిటీ వేసింది టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు అని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. టీడీపీ అద్య‌క్షుడు చంద్ర‌బాబుకు స‌న్నిహితుడు అయిన రేవంత్ రెడ్డికి చోటు క‌ల్పించిన నేప‌థ్యంలో ఇది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

పొత్తుల ప్ర‌తిపాద‌న‌ల నేప‌థ్యంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో పాటు రేవంత్ రెడ్డి - మధుయాష్కీ గౌడ్‌ తో కాంగ్రెస్ పార్టీ క‌మిటీ ఏర్పాటు చేసింది. పొత్తులపై వీరు చర్చలు జరపనున్నారు, కానీ ప్రాతిప‌దిక‌లు రూపొందించ‌నున్నారు. అయితే, పేరుకు పొత్తుల వ్య‌వ‌హారమైనప్ప‌టికీ టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుతో దోస్తీ కోస‌మే ఈ ప్ర‌హ‌స‌నం సాగుతోందంటున్నారు. ఫైర్‌ బ్రాండ్ నాయ‌కుడిగా పేరున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరిక సంద‌ర్భంగానే ఆయ‌న వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌నే వాద‌న తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌లు వేదిక‌ల్లో కూడా ఆయ‌న చంద్ర‌బాబుపై తన ప్రేమ‌ను చాటుకున్నారు. అలాంటి రేవంత్ రెడ్డిని స‌భ్యుడిగా క‌మిటీ వేయ‌డం అంటే...కాంగ్రెస్‌-టీడీపీల మ‌ద్య పొత్తుకు సంబంధించిన ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకేన‌ని అంటున్నారు. మ‌రోవైపు ఈ క‌మిటీలో స‌భ్యుడిగా మ‌ధుయాష్కీకి చోటు క‌ల్పించ‌డం వెనుక ఢిల్లీ స్కెచ్ ఉందంటున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి స‌న్నిహితుడు అయిన యాష్కీ ఈ పొత్తుకు ఆచ‌ర‌ణ రూపం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌ని పేర్కొంటున్నారు

ఇప్ప‌టికే కాంగ్రెస్ -టీడీపీల మ‌ధ్య పొత్తు దాదాపుగా ఖ‌రారైన‌ట్లుగా వార్త‌లు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జీ కుంతియ‌ - టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి మ‌ధ్య ఓ హోట‌ల్‌ లో అర్ధ‌రాత్రి ర‌హ‌స్యంగా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దానికి కొన‌సాగింపుగానే ఈ క‌మిటీ అని...కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ మాన‌స స‌రోవ‌ర యాత్ర నుంచి తిరిగి రాగానే ఈ బంధానికి ఆమోద‌ముద్ర ప‌డుతుంద‌ని చెప్తున్నారు. కాగా, ఈ పొత్తుల‌తో త‌మ సీటుకు ఎస‌రు వ‌స్తుంద‌ని ఇటు టీడీపీ నేత‌లు అటు కాంగ్రెస్ నేత‌లు క‌ల‌వ‌ర‌ప‌డుతుండ‌టం కొస‌మెరుపు.
Tags:    

Similar News