మాజీపై రేవంత్ గురి.. గులాబీ ద‌ళానికి దెబ్బేనా?

Update: 2021-09-02 04:30 GMT
మ‌ల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎక్క‌డున్నా త‌న‌దైన శైలితో దూసుకెళ‌తారు. ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న ఓ రేంజి దూకుడును ప్ర‌ద‌ర్శించారు. అలాంటిది ఇప్పుడు మ‌ల్కాజిగిరి ఎంపీగానే కాకుండా తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) పీఠం ద‌క్కిన త‌ర్వాత ఊరికే ఉంటారా?  తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించ‌డ‌మే లక్ష్యంగా సాగుతున్న రేవంత్.. ఇప్పుడు మ‌రింత‌గా స్పీడు పెంచేశారు. పార్టీలో సైలెంట్ అయిపోయిన నేత‌ల‌ను తిరిగి యాక్టివేట్ చేస్తున్న రేవంత్‌.. ఇప్పుడు ఇత‌ర పార్టీల్లోని కీల‌క నేత‌ల‌ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే దిశ‌గా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇలాంటి వ్యూహాల్లో భాగంగా గ‌తంలో తెలుగు నేల రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుని. ఏ పార్టీలో ఉన్నా స‌త్తా చాటుతున్న మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే దిశ‌గా రేవంత్ సాగుతున్నారు. ఈ వ్యూహం ఫ‌లిస్తే.. అధికార టీఆర్ఎస్ భారీ దెబ్బ త‌ప్ప‌ద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

తుమ్మ‌ల‌తో రేవంత్ కు మంచి ప‌రిచ‌య‌మే ఉంది. గ‌తంలో ఈ ఇద్ద‌రు నేత‌లు టీడీపీలోనే క‌లిసి కొన‌సాగారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రిగా తుమ్మ‌ల కీల‌కంగా వ్య‌వ‌హ‌రించేవారు. ఆ స‌మ‌యంలో యువ నేత‌గా రేవంత్ రెడ్డి త‌న‌దైన స్టైల్లో స‌త్తా చాటారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో టీడీపీ భ‌విత ప్రశ్నార్థకం కాగా.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే.. తుమ్మ‌ల టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీడీపీని వీడాక రెండు వేర్వేరు పార్టీల్లో చేరిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రి మ‌ధ్య సంబందాలేమీ చెడ‌లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. తుమ్మ‌ల ఖ‌మ్మం జిల్లాకు చెందిన వారైతే.. రేవంత్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన వారు. టీఆర్ఎస్ లో చేరిన తుమ్మ‌ల.. కేసీఆర్ తొలి టెర్మ్ లోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. అయితే 2018 ఎన్నికల్లో తుమ్మ‌ల గెల‌వ‌లేక‌పోయారు. కేసీఆర్ మ‌రోమారు ఎమ్మెల్సీ ఇస్తార‌ని అనుకున్నా.. అది కార్య‌రూపం దాల్చ‌లేదు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ తొలుత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా త‌న‌దైన శైలి స‌త్తా చాటి తాజాగా ఏకంగా టీపీసీసీ చీఫ్ ప‌ద‌వినే ద‌క్కించుకున్నారు.

రేవంత్ కు ఎప్పుడైతే టీపీసీసీ ప‌గ్గాలు చేతికందాయో అప్పుడే తెలంగాణ రాజ‌కీయాలు హీటెక్కిపోయాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడో సారి విజ‌యం సాధించాలంటే.. టీఆర్ఎస్ అటు బీజేపీతో పాటు ఇటు అంత‌కంత‌కూ బ‌లోపేతం అవుతున్న కాంగ్రెస్ తో ఢీకొట్టాలి. బీజేపీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంపిక‌తో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుంచే పెను ముప్పు ప‌రిణ‌మించే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రేవంత్ కు కీల‌క ప‌ద‌వితో ఇప్ప‌టికే కాంగ్రెస్ లో ఓ రేంజి జోష్ క‌నిపిస్తోంది. ఇలాంటి క్ర‌మంలో ఖ‌మ్మం జిల్లా పాలేరుకు చెందిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో టీఆర్ఎస్ లో ఉన్న తుమ్మ‌ల‌ను కాంగ్రెస్ లోకి లాగేస్తే.. కేసీఆర్ కు గ‌ట్టి స‌మాధాన‌మే ఇచ్చిన‌ట్టు అవుతుంద‌న్న‌ది రేవంత్ భావన‌గా తెలుస్తోంది. పాలేరుపైనే కాకుండా ఖ‌మ్మం జిల్లావ్యాప్తంగా మంచి ప‌ట్టున్న తుమ్మ‌ల ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదే అదనుగా రేవంత్ రంగంలోకి దిగి త‌న పాత ప‌రిచయాల‌ను వినియోగించుకుని తుమ్మ‌ల‌ను కాంగ్రెస్ లోకి ర‌ప్పించే దిశ‌గా వ్యూహం ర‌చించార‌ట‌. ఈ వ్యూహం వ‌ర్క‌వుట్ అయితే ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు తుమ్మ‌ల‌కు కూడా ల‌బ్ధి జ‌రిగే అవ‌కాశాలున్నాయి. అదే స‌మ‌యంలో ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు భారీ గండి ప‌దే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News