మెగాస్టార్ కే గేలం వేస్తున్నారా... ?

Update: 2021-11-07 13:30 GMT
అవును ఇది రాజకీయం. దానికి పరిధులూ పరిమితులూ అసలు లేవు. అసాధ్యం అన్న మాటలి అక్కడ తావు లేదు. ఎపుడు ఏమైనా జరగవచ్చు. విషయానికి వస్తే ఏపీలో కాంగ్రెస్ బలం ఎంతో అందరికీ తెలుసు. అటువంటి కాంగ్రెస్ కూడా 2024 ఎన్నికలకు తనదైన వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా ఏపీలో సత్తా చాటాలని చూస్తోంది. తెలంగాణాలో రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకుంది. ఏపీలో కూడా అలాంటి సీన్ ఉండాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకోసం తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలను బయటకు తీయాలని చూస్తున్నారుట.

ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై కొట్టేశారు అన్నదే అందరి మాట. ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేశారు. ఆ మీదట కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. కొన్నాళ్ళు రాజ్యసభ సభ్యుడిగా వెలిగారు. 2018 తరువాత ఆ సభ్యత్వం పూర్తి కావడంతో చిరంజీవి పూర్తిగా రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు. అయితే ఈ మధ్య రాహుల్ గాంధీ సమక్షంలో ఏపీ తెలంగాణా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగినపుడు రాహుల్ చిరంజీవి గురించి వాకబు చేశారుట. చిరంజీవిని యాక్టివ్ చేయాలని కూడా పార్టీ నేతలకు సూచించారుట.

నిజానికి రాజకీయలకు దూరంగా ఉన్నప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ కి ఇప్పటికీ రాజీనామా చేయలేదని చెబుతారు. దాంతో కాంగ్రెస్ లో ఇంకా మెగా ఆశలు అలా మిణుకు మిణుకుమంటున్నాయి. చిరంజీవిని ఎలాగైనా ముగ్గులోకి దింపి ఏపీ రాజకీయాల్లో దూసుకుపోవాలని చూస్తున్నారుట. ఈ మధ్యన తరచుగా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అంటూ చెబుతున్నారు. ఆ మాటలకు అర్ధం మెగాస్టార్ ని తిరిగి కాంగ్రెస్ లో యాక్టివ్ చేయడమే అంటున్నారు.

అయితే చిరంజీవి కమిట్ అయిన సినిమాల లిస్ట్ ని చూసినా ఆయన వైఖరిని బట్టి చూసినా రాజకీయాల్లోకి తిరిగి వస్తారా అన్న డౌట్లు అయితే అందరిలో ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో చెప్పలేం కాబట్టి చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్ లో చేరి ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ కి అనుకూలంగా చేసే ప్రయత్నం అయితే చేయవచ్చు అన్న మాట అయితే వినిపిస్తోంది. మెగాస్టార్ అడుగులు కాంగ్రెస్ వైపు పడితే అపుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన సంగతి ఎలా ఉంటుందో కూడా చూడాలి. అయితే జనసేన కాంగ్రెస్ ల మధ్య పొత్తులు ఉంటాయని కూడా మరో వైపు జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇవన్నీ జరగాలీ అంటే 2022లో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావాలి. ఆ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడి కాంగ్రెస్ పుంజుకుంటే మాత్రం దాని ప్రభావం బలంగా ఏపీ మీద పడే చాన్స్ ఉంది. అపుడు అనూహ్యమైన పరిణామాలే సంభవిస్తాయని అంటున్నారు.
Tags:    

Similar News