వారు క‌లిసినా.. యుద్ధం ఆగ‌దు: రేవంత్‌

Update: 2016-01-11 10:04 GMT
`చంద్ర‌బాబు-కేసీఆర్ మైత్రి వ‌ల్ల‌.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైలెంట్ ఆయిపోయారు.. ఇక ఆయ‌న మాటల్లో మునుప‌టి వేడి క‌నిపించ‌డం లేదు.. రేవంత్ చేతులు ఇక క‌ట్టేసిన‌ట్టే`.. ఇవి కొన్ని రోజులుగా తెలంగాణ‌లో ప్ర‌ధానంగా వినిపిస్తున్న మాట‌లు. అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌.. అయుత చండీ యాగం.. కేసీఆర్‌-చంద్ర‌బాబు మ‌ధ్య వైరాన్ని మైత్రిగా మార్చాయి.. కానీ కొంత‌కాలం నుంచి విమ‌ర్శ‌ల స్థాయి త‌గ్గింది. దీనిపై తొలిసారి రేవంత్  స్పందించారు. మైత్రి మైత్రేన‌ని.. మైత్రితో త‌న చేతులు క‌ట్టేయ‌లేర‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. కేసీఆర్‌ పై యుద్ధం కొన‌సాగిస్తూనే ఉంటాన‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం చెప్పారు. హైదరాబాద్‌ లో శాంతిభద్రతలు బాగా క్షీణించాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ పునర్వైభవం కోసం పాకులాడటం లేదని, ఇప్పటికి తమ పార్టీకి నగరంలో మంచిపట్టు ఉందన్నారు. కొంతమంది నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేద‌న్నారు. కుటుంబ శుభకార్యాలు ఉండటడం వల్ల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు. ప్రజలకు టీఆర్ ఎస్ పాలన నుంచి విముక్తి కలిగిస్తానని.... ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను గద్దె దించడమే త‌న అంతిమ లక్ష్యమని రేవంత్ ప్ర‌క‌టించారు.

 చంద్రబాబు - కేసీఆర్ మిత్ర‌త్వంతో తెరాసపై రేవంత్ రెడ్డి చేయి కట్టేసినట్లయిందనే వాదనలు వినిపిస్తున్నాయని అడగ్గా..  `నా చేయి కట్టిపడేయలేదు ..ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ఒకటి రెండుసార్లు కలిశారు. అలాంటప్పుడు ప్రధానిపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడం లేదా` అని ప్రశ్నించారు. అలాగే తాను ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానని చెప్పారు.   చంద్రబాబు తెలంగాణకు పూర్తిగా దూరమయ్యారా అని ప్రశ్నిస్తే... `ఇంకా చేయి పట్టి నడిపించలేరని, ఏపీ ముఖ్యమంత్రి అయినందున ఆయన అక్కడ బిజీగా ఉంటారని, ఇక్కడ మేం పోరాడాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీని ఎలా నడిపించాలో ఆయ‌న‌ మాకు నేర్పించారన్నారు. ఎవరు ఆహ్వానించినా, ఎన్ని ఒత్తిడులు ఉన్నా తాను పార్టీ మారేది లేదని చెప్పారు.
Tags:    

Similar News