రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ప్లాన్ ఇదే !

Update: 2016-02-17 05:18 GMT
కారు స్పీడ్ కు సైకిల్ గిలగిలాడిపోతున్న పరిస్థితి. కారుతో పొల్యూషన్.. సైకిల్ తో సొల్యూషన్ లాంటి మాటలు తెలంగాణలో అస్సలు పని చేయటం లేదు. అధికారపార్టీ మీద ఎంత విరుచుకుపడుతున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారుతోన్న దుస్థితితో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు విలవిలలాడిపోతున్నారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో అంతకంతకూ తగ్గుతున్న తెలుగుదేశం ప్రాభవం.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన ఆపరేషన్ టీడీపీ ఫినిష్ చివరకు చేరటంతో తెలంగాణ తమ్ముళ్లు విలవిలలాడిపోతున్నారు. ఎవరు ఎప్పటి వరకూ ఉంటారో అర్థం కాని పరిస్థితి.

ఇలాంటి సిట్యూవేషన్ లో పార్టీ మైలేజ్ తెచ్చేందుకు వీలుగా టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో రోజురోజుకీ కొడిగడుతున్న టీటీడీపీ ప్రభకు కొత్త ఊపును తెచ్చేందుకు వీలుగా టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ రానున్న వేసవిలో తెలంగాణ ప్రజలు దాహార్తితో విలవిలలాడటం ఖాయమని..  నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న వేళ.. కేసీఆర్ సర్కారు వైఫల్యాల గురించి ప్రజల్లోకి తీసుకెళితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా వేసవిలో తన పాదయాత్ర ఉండేలా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకూ పాదయాత్రలు చేసిన వైఎస్.. చంద్రబాబు.. షర్మిలలు తాము కోరుకున్న ఫలితాల్ని ఎంతోకొంత రాబట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రతో తెలంగాణలో పార్టీ బలాన్ని ప్రదర్శించటంతో పాటు.. టీటీడీపీకి నాయకుల లేమి ఉన్నప్పటికీ కార్యకర్తలకు ఢోకా లేదన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మండే ఎండా కాలంలో రేవంత్ పాదయాత్ర మరింత మంట పుట్టించేలా ఉంటున్న మాట వినిపిస్తోంది. అదెంత నిజమన్నది పాదయాత్ర షురూ అయితే కానీ తెలీదని చెప్పొచ్చు.
Tags:    

Similar News