కేసీఆర్ ఇలాకాలో రేవంత్‌ కు ఘ‌న స్వాగ‌తం!

Update: 2016-06-25 12:37 GMT
మెదక్ జిల్లా గజ్వేల్.. ఈ ఊరు పేరు తలుచుకోగానే ఠక్కున గుర్తుకువచ్చే పేరు కేసీఆర్! ఎందుకంటే కేసీఆర్ కి - గజ్వేల్ కి అంతటి అవినాభావ సంబంధం!! ఆయన ఈ నియోజకవర్గం నుంచి గెలిచి సీఎంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అంతేకాదు దేశంలో మోడల్ నియోజకవర్గంగా దీనిని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాంటి సీఎం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ నేత - అందునా ఓటుకు నోట్లు కుంభకోణంలో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డికి శనివారం ఘనస్వాగతం లభించింది. దీంతో ఈ వార్త ప్రసారమాధ్యమాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

మెద‌క్ జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవున్న వారి పక్షాన దీక్ష చేపట్టేందుకు అక్కడికి వెళ్తూ.. రేవంత్ గజ్వేల్ లో ఆగారు. ఈ సందర్భంగా రేవంత్ కు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. తనను చూసేందుకు వచ్చిన గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నిర్మాణంతో ఏమైనా సమస్యలున్నాయా అని వారిని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా..  పేదల కడుపులు కొట్టి - జేబులు నింపుకోవడానికే మల్లన్న సాగర్ నిర్మిస్తున్నారని కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు. మామా - అల్లుడు ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని రేవంత్ దుయ్యబట్టారు.  మల్లన్న సాగర్ నిర్మించడం కోసం మంత్రి హరీష్ రావు రైతులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులు శాంతియుతంగా వారి వ్యతిరేకతను తెలుపుతున్నారని కాని హరీష్ రావు శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారని విమర్శించారు.

4వేల గ్రామాలను కదిలిస్తామని హరీష్ బెదిరిస్తున్నారని అమాయక రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రేవంత్ విరుచుకుపడ్డారు.  2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. నిర్వాసితులను భిక్షగాళ్లుగా మార్చుతుంటే చూస్తూ ఉరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇదంతా బాగానే ఉన్నా.. కేసీఆర్ కు కంచుకోట అయిన గజ్వేల్ లో అక్కడి ప్రజలు రేవంత్ కు బ్రహ్మరథం పట్టడంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చంతా నడుస్తోంది.
Tags:    

Similar News