రేవంత్ విమ‌ర్శ‌లు..నోటీసులు ఇచ్చిన కేటీఆర్ బావ‌మ‌రిది

Update: 2017-11-25 16:51 GMT
కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌ర్వాత కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి తొలిసారిగా నోటీసు వ‌చ్చింది. అదికూడా ఊహించిన‌ట్లుగానే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచే రేవంత్ అందుకోవాల్సి వ‌చ్చింది. హైదరాబాద్‌ నగర పరిధిలోగల మాదాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన సన్‌బర్న్ పై రేవంత్ విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. స‌న్‌బర్న్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు సంబంధం ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు అందాయి.

స‌న్ బ‌ర్న్‌ కార్యక్రమానికి సంబంధించి విమ‌ర్శ‌లు చేసే స‌మ‌యంలో త‌న‌కు ప‌బ్‌ల‌తో సంబంధం అంట‌గ‌ట్ట‌డం స‌రికాద‌ని రాజ్‌పాకాలా తెలిపారు. తనపై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో రాజ్‌ పాకాల డిమాండ్‌ చేశారు. ఒక‌వేళ రేవంత్‌ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

కాగా, ఇటీవ‌ల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా వచ్చిన త‌ర్వాత‌ డ్రగ్స్, పబ్స్ మాత్రమే పెరిగాయని  ఆరోపించారు. డ్ర‌గ్స్‌ సరఫరాదారులు కేసీఆర్ కుటుంబానికి దగ్గర వ్యక్తులని రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈవెంట్ నౌ అనే సంస్థకు కూడా సంబంధం ఉందని ఆరోపించారు. సన్ బర్న్ పార్టీలను అదుపు చెయ్యలేక గోవా ప్రభుత్వమే రద్దు చేసిందని రేవంత్ వివ‌రించారు. ఈ త‌ర‌హా పార్టీల‌లో మాదక ద్రవ్యాల వాడ‌కం ఎక్కువ‌గా ఉంటుంద‌ని, మహిళల మీద దాడులు జరుగుతాయని అందుకే కర్ణాటక, మహారాష్ట్ర కూడా అనుమతులు ఇచ్చి రద్దు చేసిందని రేవంత్ తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత సన్ బర్న్ పార్టీలకు క్రీడా మైదానాలు ఇస్తున్నారని ఆరోపించారు. హైటెక్స్‌లో, గచ్చిబౌలి స్టేడియంలో అనుమతి ఇచ్చారని ఆరోపించారు. వీటికి టికెట్స్ అమ్మింది ఈవెంట్స్ నౌ అని పేర్కొంటూ...అది పాకాల రాజేంద్ర ప్రసాద్ సంస్థ అని తెలిపారు. ఆయ‌న మంత్రి కేటీఆర్ సొంత బామ్మర్ది అని పేర్కొంటూ అందుకే డ్రగ్స్ కేస్ మూత పడింద‌ని రేవంత్ ఆరోపించారు. వీటికే రాజ్‌పాకాలా నోటీసులు అందించారు.

కాగా, గ‌చ్చిబౌలి స్టేడియంలో జ‌ర‌గ‌నున్న స‌న్ బ‌ర్న్ పార్టీకి మైన‌ర్లను అనుమ‌తి ఇచ్చార‌ని హైకోర్టును ఆశ్రయించిన ఉదంతంలో న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీకి అనుమ‌తి కోరుతూ హైకోర్టులో వేసిన పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు పార్టీ చేసుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చిన‌ప్పుడు నిబంద‌న‌లు ప‌ట్టించుకోరా అని నిల‌దీసింది. అనుమ‌తి ఇస్తూనే ష‌ర‌తులు విధించింది. పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాల‌ని ఎక్సైజ్ , లా అండ్ ఆర్డ‌ర్ పోలీసుల‌కు హైకోర్టు ఆదేశించింది. 30లోగా వీడియో రికార్డుల‌ను స‌మ‌ర్పించాల‌న్న హైకోర్టు ..తుదిప‌రి విచార‌ణ 30కి వాయిదా వేసింది.
Tags:    

Similar News