కేటీఆర్ ఫామ్ హౌజ్ పై డ్రోన్..రేవంత్ ప్లానేనా?

Update: 2020-03-04 13:30 GMT
ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కొడుకు. పైగా మంత్రి. కేసీఆర్ తర్వాత తెలంగాణలో నంబర్ 2. అలాంటి కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌజ్ మీద డ్రోన్ ఎగరడం.. వీడియో తీయడం కలకలం రేపింది. రాష్ట్ర రాజకీయాల్లోనే రచ్చకు దారితీసింది. కేటీఆర్ ఫామ్ హౌజ్ గుట్టుమట్లను తెలుసుకునేందుకే కాంగ్రెస్ నేతలు ఈ పనిచేశారని తెలియడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

ఇటీవల కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి సహా పలువురు హైదరాబాద్ శివారుల్లోని జున్వాడ లో ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్ద ఆందోళన చేశారు. ఈ ఫామ్ హౌస్ ను కేటీఆర్ లీజుకు తీసుకున్నాడు. దీన్ని కేటీఆర్ కబ్జా చేశాడని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఫామ్ హౌస్ గుట్టుమట్లను తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు.

తాజాగా కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఓ డ్రోన్ ఎగిరి మొత్తం క్యాప్చర్ చేసింది. శంషాబాద్ మాజీ జడ్పీటీసీ జైపాల్ సహా నలుగురు కాంగ్రెస్ నేతలు డ్రోన్ సాయంతో కేటీఆర్ ఫాంహౌస్ గుట్టుమట్లను చిత్రీకరించారట..

దీనిపై సీరియస్ అయిన పోలీసులు అనుమతి లేకుండా ప్రైవేటు భూములు, ప్రాంతాల్లో డ్రోన్స్ వినియోగించడాన్ని నేరంగా పరిగణిస్తూ జైపాల్ సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల ఆదేశాలతోనే తాము కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ద్వారా చిత్రీకరించినట్టు వారు తెలిపారని సమాచారం.


Tags:    

Similar News