రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ ఎపుడు?

Update: 2018-02-12 06:31 GMT
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదులుకుని కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో ఇర‌కాట‌మైన ప‌రిస్థితులు మొద‌ల‌య్యాయా? ఆయ‌న వెంట న‌డిచి కాంగ్రెస్‌ లో చేరిన నేత‌లు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిపై అసంతృప్తితో ఉన్నారా?  సొంత పార్టీ అయిన టీడీపీలో త‌మ‌కు గుర్తింపు - గౌర‌వం ద‌క్కిన‌ప్ప‌టికీ...హ‌స్తం పార్టీలో అదేమీ లేద‌ని వాపోతున్నారా? అంటే అవున‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ నుంచి వ‌ల‌స వ‌చ్చిన నేతలు కాంగ్రెస్‌ లో త‌మ‌కు గుర్తింపు ద‌క్క‌క‌పోవ‌డంతో మ‌థ‌న‌ప‌డుతున్నార‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

స్వ‌ల్ప‌కాలంలోనే విశేష గుర్తింపు ఇచ్చిన‌ప్ప‌టికీ...టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వదులుకొని మ‌రీ రేవంత్ కాంగ్రెస్‌ లో చేరారు. ఆయ‌న చేరిక స‌మ‌యంలో కాంగ్రెస్‌ లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ లభిస్తుందని, పార్టీ హామీ లభించిన తర్వాతే కాంగ్రెస్‌ లో చేరినట్లు ప్ర‌చారం జ‌రిగింది. రేవంత్‌ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క - వేం నరేందర్ రెడ్డి - బోడ జనార్ధన్ స‌హా పలువురు ముఖ్య నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఆ పార్టీలో వారికి  ఎలాంటి గౌర‌వం ద‌క్క‌లేదు. రేవంత్ రెడ్డి త‌న‌తో పాటు తన వెంట వచ్చిన ముఖ్యులకు సముచిత స్థానం కల్పించాలన్న డిమాండ్ పార్టీ ముందు పెట్టిన‌ప్ప‌టికీ అది ఫ‌లితం ఇవ్వ‌లేదు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన నేత‌ల్లో ఆశ‌లు చిగురించాయి. అయితే అదేమీ జ‌ర‌గ‌లేదు.దీంతో తెలంగాణ టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏఐసీసీ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ కొనసాగుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో కింది స్థాయిలో అవసరమైన మార్పులు చేసుకోవడానికి - ఖాళీలు ఉంటే భర్తీ చేసుకునేందుకు అధ్యక్షులకు అవకాశం కల్పించారు. అయిన‌ప్ప‌టికీ...ఉత్తమ్‌ కుమార్ రెడ్డి త‌మ వ‌ర్గానికి ప‌ద‌వులు ఏవీ ఇవ్వ‌లేద‌ని - రేవంత్ వెంట న‌డిచినందుకు త‌మ‌కు ద‌క్కింది ఏమిట‌ని టీడీపీ నుంచి వ‌ల‌స వ‌చ్చిన నేత‌లు చ‌ర్చించుకుంటున్నట్లు స‌మాచారం.
Tags:    

Similar News