అందరినీ అడ్జస్ట్ చేసేస్తున్న రేవంత్!

Update: 2017-11-09 04:25 GMT
కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు ప్రధానంగా రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి- పార్టీలో తన రాకను వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులను ప్రసన్నం చేసుకోవడం, రెండు- ఇతర పార్టీలనుంచి కాంగ్రెస్ లోకి తన ప్రభావంతో రాగల నాయకులు ఎవ్వరో ఐడెంటిఫై చేసి.. ఆ వ్యవహారం నడిపించడం. అంటే ఇప్పుడు రేవంత్ పని తాత్కాలికంగా నాయకుల మ్యాన్ పవర్ మేనేజిమెంట్ లాగా తయారైనదన్నమాట. ఈ విషయంలో ఆయన చాలా సక్సెస్ ఫుల్ గా అందరినీ అడ్జస్ట్ చేస్తున్నారని.. ఒకటోకేటగిరీ - రెండో కేటగిరీ రెండు చోట్లా అడ్జస్ట్ మెంట్స్ నడుస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని ఆ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన రాకను వారు జీర్ణం చేసుకోలేకపోయారు. అలాంటి వారిని దారికి తెచ్చుకోవంలో రేవంత్ సక్సెస్ ఫుల్ గానే పావులు కదిపినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా రెడ్డి వర్గానికి చెందిన సీనియర్లు రేవంత్ ను వ్యతిరేకించారు. వారిలో ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన డీకే అరుణ - కోమటిరెడ్డి బ్రదర్స్ తదితరులు అనేకులు ఉన్నారు.

రేవంత్ పార్టీలోకి వస్తే.. ఒకే జిల్లా - ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులుగా మంత్రి పదవులు పొందడంలో కోటాలు మారుతాయనే భయం డీకే అరుణకు ఉండవచ్చు. అలాగే తాను ఏదో ఒక నాటికి ముఖ్యమంత్రి కాగలననే కోరిక కూడా ఆమెకు ఉన్నదని కొందరు అంటూ ఉంటారు. మరి.. అలాంటప్పుడు ఆమెను దారికి తెచ్చుకోవడం చిన్న సంగతి కాదు. పార్టీలో చేరేముందు- తర్వాత డీకే అరుణ ఇంటికి తానే స్వయంగా వెళ్లి.. మాట్లాడిన రేవంత్ సక్సెస్ అయ్యారు. తాజాగా తన నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆత్మీయ సమావేశం పెట్టి ఆమెను కూడా అతిథిగా రప్పించి.. తమ మధ్య అసంతృప్తులు లేవనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ రకంగా తన రాకను వ్యతిరేకించిన పార్టీలోని సీనియర్లందరినీ... ఒక్కరొక్కరుగా రేవంత్ అడ్జస్ట్ చేసేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News