జోరున పడే వానను సభకొచ్చిన వేలాది మంది లెక్క చేయలేదు

Update: 2021-08-19 04:34 GMT
పదునైన మాటలు.. అంతకు మించిన వ్యంగ్య వ్యాఖ్యలు.. ఘాటైన పదజాలంతో తెలంగాణ అధికారపక్షాన్ని అదేపనిగా ఉక్కిరిబిక్కిరి చేసే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తన మాటల విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. వరుస పెట్టి బహిరంగ సభల్నినిర్వహిస్తున్న ఆయన.. తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాలలో నిర్వహించిన ‘దళిత.. గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జోరున పడుతున్న వానను లెక్క చేయని రేవంత్.. ఉత్సాహం ఏ మాత్రం తగ్గకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రేవంత్ ఆగ్రహాంతో పాటు ఆవేశానికి తగ్గట్లు.. ఆయన మాటల్ని వినేందుకు సభకు వచ్చిన వేలాది మంది సైతం జోరున కురుస్తున్న వానలోనూ ఆయన మాటల్ని వినేయటం గమనార్హం. కొద్దిమంది తమకు వేసిన కుర్చీల్ని నెత్తిన పెట్టుకొని తడుస్తూనే సభ మొత్తం ఫాలో అయ్యారు. ఇంద్రవెల్లి సభతో పోలిస్తే.. వర్షం ఈ బహిరంగ సభను కాస్త దెబ్బేసిందని చెప్పకతప్పదు. అయినప్పటికి కాంగ్రెస్ బలం ఏమిటో ఈ సభ చెప్పిందన్న మాట విశ్లేషకుల నోట వినిపిస్తోంది. దీనికి కారణం.. తుక్కుగూడ.. రావిర్యాల.. ఆదిభట్లలోని ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లన్నీ జనసందడితో కిక్కిరిశాయి. దాదాపు ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవటం దీనికినిదర్శనంగా చెప్పొచ్చు.

ఎప్పటిలానే తాజా సభలోనూ సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా పందొమ్మిది నెలలు ఈ దరిద్రుడి పాలనలో ఉండాలా? దళిత ఆదివాసీలు ఈ కష్టాల్ని ఇంకా ఓర్చుకోవాలా? టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ ఆయన విరుచుకుపడ్డారు. దళితబంధు కింద ఇచ్చే రూ.10లక్షలు ఎవరి భిక్ష కాదని.. కేసీఆర్ ఆయన అయ్య జాగీరేం ఇస్తలేడన్నారు. ‘అది మా హక్కు. అదంతా మా సంపదేనని ఈ ప్రాంత దళిత.. గిరిజనులు భావిస్తున్నారు. దళితులు.. గిరిజనలు విద్య.. ఉపాధి కోరుకుంటున్నారు. వారికి అవి దక్కకుండా చేస్తున్నారు. తెలంగాణ కడుపు మండుతోంది. ఉద్యమకారులు ఆవేశంతో రగిలిపోతున్నారు. తెలంగాణ కోసం చనిపోయిందెవరో.. ఇవాళ తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో ప్రజలు ఆలోచించాలి’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఆరాచకపు పాలనను అడ్డుకునేందుకు తొలి అడుగు ఇంద్రవెల్లిలో వేశామని.. మలి అడుగు మహేశ్వరంలో పెట్టామన్నారు. ఇంకా ఒకే ఒక్క అడుగు ఉందని.. కేసీఆర్ నెత్తి మీద పెడతామన్న ఆయన.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సభకు వచ్చిన వేలాది జనసందోహాన్ని వీడియో తీసిఇంటెలిజెన్స్ పోలీసు అధికారులు.. టీఆర్ఎస్ సన్నాసులు.. కేసీఆర్ కు పంపాలన్నారు.

నెల నుంచి కేసీఆర్ కాలు కాలిన పిల్లిలా.. కల్లు తాగిన కోతిలా గంతులు వేస్తున్నారని.. దీనికికారణం సోనియా నిర్ణయమేనని చెప్పారు. కేసీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇక్కడి ప్రజలు లేరన్నారు. ఆయన దొడ్లో ఉన్న సన్యాసి ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఆయన మోచేతి నీళ్లకు ఆశపడుతారేమో కానీ తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛను.. స్వయం పాలనను.. సామాజిక న్యాయాన్ని కోరుకుంటారన్నారు.

తెలంగాణ వస్తే కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని.. ఆయన కొడుకు.. అల్లుడుకు మంత్రి పదవులు వచ్చాయని.. సడ్డకుని కొడుకుకు రాజ్యసభ సభ్యుడిగా పదవి వచ్చిందని.. రాసుకోవటానికి పేపరు వచ్చింది.. చూసుకోవటానికి టీవీ వచ్చింది.. ఫామ్ హౌజ్ లు వచ్చాయి.. వ్యాపారాలు చేసుకోవటానికి లక్షల కోట్లు వచ్చాయి.. కానీ అమరుల కుటుంబాలకు ఏమి వచ్చాయో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

తెలంగాణ భవిష్యత్తు హుజూరాబాద్ బిడ్డల చేతిలో ఉందన్నారు రేవంత్. నయాజిత్తులనక్క ఓట్ల కోసం బొక్కలో నుంచి బయటకు వచ్చిందని.. ఇప్పుడే ఆ నక్కకు తోకపట్టి కొట్టాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ప్రజలు గునపంతో ఒక గుద్దు గుద్దితే కేసీఆర్ గుండెలు పగలాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాచారం చుట్టుపక్కల దళితులకు 8632 ఎకరాల భూమిని ఇస్తే.. వాటిని లాక్కొని ఎకరానికి రూ.8లక్షలు చేతిలో పెట్టారంటూ మండిపడ్డారు. ఈ భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం కోట్ల రూపాయిలకు అమ్ముకుంటుందన్నారు. వీటిని ప్రశ్నించిన వారిని జైలుపాలు చేస్తుందంటూ ఫైర్ అయ్యారు.



Tags:    

Similar News