కాక రేపుతున్న రేవంత్ వైట్ చాలెంజ్.. కేటీఆర్ ఏం చేసినా నష్టమేనా?

Update: 2021-09-19 04:18 GMT
తెలివి ఎవరి సొత్తు కాదు. కాలానికి అనుగుణంగా.. ఎప్పటికప్పుడు అధిక్యతలు మారుతూ ఉంటాయి. మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా.. రాజకీయాల్లో అధిక్యతలు క్షణాల్లో మారిపోతుంటాయి. అందుకే.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. చేసే ఒక కామెంట్.. మొత్తం సీన్ మారిపోవటానికి కారణమవుతుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మంత్రి కేటీఆర్. డ్రగ్స్ ఆరోపణల్ని కాంగ్రెస్ నేత ఒకరు మంత్రి కేటీఆర్ మీద సంధించారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. డ్రగ్స్ వినియోగం విషయంలో ఏ రోజు కూడా మంత్రి కేటీఆర్ పేరు ఎప్పుడూ.. ఎక్కడా.. ఏ సందర్భంలోనూ చర్చకు రాలేదు. ఆ మాటకు వస్తే.. మాట వరసకు కూడా అలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసింది లేదు.

అందుకు భిన్నంగా ఒక కాంగ్రెస్ నేత నోటి నుంచి వచ్చిన మాటల్ని.. మంత్రి కేటీఆర్ సీరియస్ గా తీసుకోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు సంబంధం లేని అంశం మీద తనను బద్నాం చేస్తున్నారన్న ఆవేశం.. అంతకు మించిన ఆగ్రహంతో.. తన నిజాయితీని తన మాటలతోనిరూపించుకోవాలనుకున్న ఆయన.. అనూహ్యంగా అడ్డంగా బుక్ అయిన పరిస్థితి. అమిత్ షా.. రేవంత్ సభల నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు మంత్రి కేటీఆర్. ఆ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు.

డ్రగ్స్ విషయంలో తానెంత నిప్పు అన్న విషయాన్ని చాటి చెప్పేందుకు వీలుగా ఆయన.. ఏ పరీక్షకైనా సిద్ధమేనని చెబుతూ.. రాహుల్ పేరును ఇందులోకి లాగారు. అంతేకాదు.. డ్రగ్స్ గురించి పెద్దగా కామెంట్లు చేయని రేవంత్ పేరును ప్రస్తావించారు. ఇదే అదునుగా భావించిన రేవంత్.. అనూహ్య రీతిలో..  వైట్ చాలెంజ్ పేరుతో కొత్త కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు. గ్రీన్ చాలెంజ్ పేరుతో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ నిర్వహించే సవాలు మాదిరే.. తాను కూడా వైట్ చాలెంజ్ చేస్తున్నానని చెప్పి.. మంత్రి కేటీఆర్.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లను నామినేట్ చేశారు.

రాజకీయ సవాలుకు భిన్నమైనది ఈ సోషల్ చాలెంజ్. దీన్ని విసిరినంతనే తమకు తాముగా స్పందిస్తుంటారు సెలబ్రిటీలు. డ్రగ్స్ ఎపిసోడ్ లో రాజకీయ సవాలుగా కాకుండా.. సోషల్ చాలెంజ్ గా కేటీఆర్ ను నామినేట్ చేశారు. రేవంత్ వ్యూహం ఫలించి.. మాజీ ఎంపీ కొండా ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. ఇక.. మిగిలింది మంత్రి కేటీఆర్ మాత్రమే. ఒకవేళ మంత్రి కేటీఆర్ సైతం ఈ సవాలును స్వీకరిస్తే.. ఆయన చేత తాను అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగిన నేతగా రేవంత్ నిలుస్తారు.

ఒకవేళ.. రేవంత్ చాలెంజ్ ను మంత్రి కేటీఆర్ స్వీకరించలేదనే అనుకుందాం. అలా చేసినా నష్టమే జరుగుతోంది? పొలిటికల్ చాలెంజ్ అయితే ఫర్లేదు కానీ.. సోషల్ చాలెంజ్ ను స్వీకరించకపోవటంపై పలు అనుమానాలు తెర మీదకు రావటం. ఇలా తన వైట్ చాలెంజ్ తో మంత్రి కేటీఆర్ ను ఇరుకున పడేలా చేయటంలో రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని అమరవీరుల స్తూపం వద్దకు తాను వస్తానని.. తన సవాలును స్వీకరించి అక్కడకు రావాలన్న రేవంత్ మాటకు కొండా ఇప్పటికే ఓకే చెప్పటంతో.. ఇక మిగిలింది మంత్రి కేటీఆర్ మాత్రమే అయ్యారు. మరి.. రేవంత్ విసిరిన సవాలును స్వీకరిస్తారా? మౌనంగా ఉంటారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News