కేసీఆర్ పై వార్ కు రెఢీ అవుతున్నారా?

Update: 2019-04-04 09:56 GMT
తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని రీతిలో అధికారాన్ని చెలాయిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్  కు ఎదురు మాట చెప్పేటోళ్లు ఒక్క‌రంటే ఒక్క‌రు క‌నిపించ‌రు. ఆయ‌న మాట‌ల్లోనూ.. చేత‌ల్లోనూ వంక పెట్టే ద‌మ్ము.. ధైర్యం ఉన్న నేత‌లే లేర‌న్న ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా.. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల్ని త‌ప్పు ప‌ట్టే ప్ర‌తిప‌క్షం నేత‌లు సైతం త‌మ ఉనికి కోసం కోట్లాడే ప‌రిస్థితి తెలంగాణ‌లో నెల‌కొంది.

త‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పే వారే లేర‌న్న‌ట్లుగా రంగం సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్‌.. రానున్న రోజుల్లో తాను చేయ‌బోయే సంచ‌ల‌న అంశాల్ని ఇటీవ‌ల కేసీఆర్ త‌న‌కు తాను బ‌య‌ట పెట్టటం తెలిసిందే. ఒక సివిల్ వివాదం విష‌యంలో రియాక్ట్ అయిన కేసీఆర్‌.. వీఆర్వోల మీద ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టం.. ఆ వ్య‌వ‌స్థ మొత్తాన్ని ప‌క్క‌న పెట్టేయాల‌న్న మాట‌ను చెప్ప‌టం లాంటివి చూసిన‌ప్పుడు.. రెవెన్యూ శాఖ‌లో భారీ ఎత్తున సంస్క‌ర‌ణ‌లు చేసేందుకు కేసీఆర్ స్కెచ్ గీసిన‌ట్లుగా చెబుతున్నారు. తానేం చేయాల‌నుకుంటున్న విష‌యాల్ని చెప్పేసిన ఆయ‌న‌.. రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించారు.

ఏ వ్య‌వ‌స్థ‌లోనూ 100 శాతం మంచివాళ్లు ఉండ‌న‌ట్లే.. 100 శాతం మందీ చెడ్డ‌వాళ్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే..రెవెన్యూ ఉద్యోగుల్లో నీతి.. నిజాయితీ అన్నది లేద‌న్న‌ట్లుగా సీఎం స్థానంలో కూర్చున్న కేసీఆర్ నోటి మాట నుంచి వ‌స్తున్న మాట‌లు రెవెన్యూ ఉద్యోగులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఒక్క‌సారి ఎన్నిక‌లు పూర్తి అయ్యాక‌.. త‌న ఎజెండాను తెర మీద‌కు తీసుకొస్తాన‌ని.. ఆ సంద‌ర్భంగా సామాన్యులు త‌నకు అండ‌గా నిల‌వాల‌ని కోరారు.

త‌న‌కు అండ‌గా నిల‌వాలంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపుకు ముందు.. ఫేస్ బుక్ లో ఒక సివిల్ వివాదం గురించి పోస్ట్ చేయ‌టం.. ఆ యువ‌కుడితో కేసీఆర్ మాట్లాడ‌టం.. అది కాస్తా త‌ర్వాత పెద్ద ఎత్తున వైర‌ల్ కావ‌టం తెలిసిందే. అయితే.. స‌ద‌రు  యువ‌కుడు (శ‌ర‌త్‌) చెప్పిన స‌మాచారానికి.. వాస్త‌వానికి మ‌ధ్య అంత‌రం ఉంద‌ని.. అది పూర్తిగా సివిల్ మ్యాట‌ర్ గా తేలింది.

త‌మ‌పై క‌త్తి క‌ట్టిన కేసీఆర్ కు కౌంట‌ర్ ఇచ్చే దిశ‌గా ప‌లువురు రెవెన్యూ స‌భ్యులు సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా స‌మావేశాలు పెట్టుకుంటున్న వారు.. ఎన్నిక‌లు అయ్యాక ద‌శ‌ల వారీగా త‌మ నిర‌స‌న‌ను పెంచాల‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు తాము బాగా ప‌ని చేస్తున్న‌ట్లు పొగిడిన కేసీఆర్‌.. ఇప్పుడు అందుకు భిన్నంగా త‌మ‌పై క‌త్తి క‌ట్ట‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

వ్య‌వ‌స్థ‌లో లోపాలు ఉంటే స‌రిదిద్దాల్సిన ప్ర‌భుత్వం.. అందుకు భిన్నంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై నింద‌లు వేసి.. వారి మ‌నోస్థైర్యాన్ని దెబ్బ తీసేలా చ‌ర్య‌లు తీసుకోవ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత ఉద్యోగ సంఘాల‌న్నింటిని ఏకం చేసి ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణకు దిగాల‌ని భావిస్తున్నారు.  రెవెన్యూ ఉద్యోగులు అవినీతిప‌రులు.. లంచ‌గొండులైతే ఇత‌ర‌శాఖ‌ల‌కు చెందిన ప‌థ‌కాలు.. ప‌నులు ఎందుకు అప్ప‌గిస్తున్నారు అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగుల‌పై చ‌ర్య‌ల‌కు కేసీఆర్ పావులు క‌దుపుతుంటే.. దాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యోగులు ఎత్తులు వేస్తున్నారు. మ‌రి.. ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కు వెళుతుందో చూడాలి.


Tags:    

Similar News