అనుకున్న‌ది చేసేశా.. పైపుల రోడ్డులో వ‌ర్మ‌!

Update: 2019-05-28 11:58 GMT
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తాను అనుకున్న‌ది చేసేశారు. విజ‌య‌వాడ‌లోని ఏ పైపుల రోడ్డులో అయితే ఎన్టీఆర్ విగ్ర‌హానికి దండేసి.. ప్రెస్ మీట్ పెట్టాల‌ని అనుకున్నారో.. అది కుద‌ర‌క రెండుసార్లు ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న‌.. ఎట్ట‌కేల‌కు ఈసారి మాత్రం ఎన్టీఆర్ విగ్ర‌హానికి దండేశారు.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుద‌ల వేళ‌.. ఈ సినిమాను ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా ఏపీలో విడుద‌ల కాకుండా ఆప‌టం.. ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టేందుకు పైపుల రోడ్డును వ‌ర్మ ఎన్నుకోవ‌టం తెలిసిందే. అక్క‌డ ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్ర‌య‌త్నించిన వ‌ర్మ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల అయ్యాక మ‌రోసారి పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెట్ట‌నున్న‌ట్లు చెప్పినా.. పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. అయితే.. ఎండ వేడి కార‌ణంగా ప్రెస్ మీట్ వెన్యూ మార్చిన‌ట్లుగా పేర్కొన్నారు.

ఈ రోజు ఎన్టీఆర్ జ‌యంతి నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లోని పైపుల‌రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హానికి దండేసేకార్య‌క్ర‌మాన్ని ద్విగ్విజ‌యంగా పూర్తి చేశారు.ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత‌తో క‌లిసి పైపుల రోడ్డు వ‌ద్ద‌కు వ‌చ్చిన వ‌ర్మ‌.. త‌న పంతాన్ని నెగ్గించుకున్నారు. పైపుల రోడ్డులో ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి.. నివాళులు అర్పించారు.ఈ  సంద‌ర్భంగా జై ఎన్టీఆర్ అని నినాదం చేసిన‌ట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.

అనంత‌రం కారులో ఎక్కిన వ‌ర్మ వ‌ద్ద‌కు మీడియా ప్ర‌తినిధులు మైకులు పెట్ట‌గా.. ఎన్టీఆర్ ఆశీస్సుల‌తో ఆయ‌న జ‌యంతి రోజున పూల‌మాల వేయ‌గ‌లిగాన‌ని చెప్పారు.ఎన్టీఆర్ ఆశీస్సుల‌తోనే త‌న పంతం నెగ్గింద‌న్న ఆయ‌న‌.. అనంత‌రం దానికి సంబంధించిన వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. పైపుల రోడ్డుకు వ‌స్తాన‌ని చెప్పా.. న‌న్ను ఆపే ధైర్యం ఉందా చంద్ర‌బాబు? అన్న కామెంట్ తో వీడియోను పోస్ట్ చేశారు. మొత్తానికి పైపుల రోడ్డు ద‌గ్గ‌ర తానేం చేయాల‌ని అనుకున్నారో వ‌ర్మ ఆ ప‌ని చేసేశార‌ని చెప్పాలి.


Tags:    

Similar News