భారత సైన్యాన్ని అవమానిస్తూ ట్వీట్.. క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..!

Update: 2022-11-24 11:30 GMT
బాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రిచా చద్దా. సినిమాల్లో బోల్డ్ గా నటించే ఈ భామ.. ఏ విషయం మీదైనా తన అభిప్రాయాలను స్పష్టంగా నిర్భయంగా వెల్లడిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు వివాదాలు కూడా కొని తెచ్చుకుంటుంది. ఇప్పుడు లేటెస్టుగా ఆమె చేసిన ట్వీట్ సరి కొత్త వివాదానికి కారణమైంది.

విషయమేంటంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన ప్రకటనను ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేసారు. దీనికి రిచా చద్దా స్పందిస్తూ.. ‘గాల్వాన్ హాయ్ చెప్తోంది’ అంటూ రీట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాల్వాన్ సంఘటన గురించి మాట్లాడటం ద్వారా భారత సైన్యాన్ని అవమానించిందని మండిపడుతున్నారు.

ఏడాది క్రితం తూర్పు లద్ధఖ్‌ సరిహద్దులోని గల్వాన్ లోయలో ఇండియా - చైనా దేశాల సైన్యాల మధ్య విధ్వంసకర ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. గత నాలుగు దశాబ్దాల్లో రెండు దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు ఎప్పుడూ చోటుచేసుకోలేదు. ఈ ఘర్షణల్లో సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అలాంటి దుర్ఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు రిచా ట్వీట్ చేసింది.

‘గాల్వాన్ సే హాయ్’ అని రిచా చద్దా ట్వీట్ చేసి.. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరులను.. సైన్యాన్ని అపహాస్యం చేసిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇండియన్ ఆర్మీని అవమానిస్తూ, అవహేళన చేస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రిచా ని ట్రోల్ చేసారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని ముంబై పోలీసులను కోరారు. ఇది చాలా అవమానకరమైన ట్వీట్ అని.. భారత సాయుధ బలగాలను అవమానించిన ఈ ట్వీట్ ని ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.

ఈ నేపథ్యంలో తన ట్వీట్ పై నెలకొన్న వివాదంపై రిచా చద్దా స్పందించింది. కావాలని ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని.. అనుకోకుండా జరిగిందంటూ క్షమాపణలు చెప్పింది. "ఇది నా ఉద్దేశ్యం కానప్పటికీ, వివాదంలోకి లాగుతున్న 3 పదాలు ఎవరినైనా నొప్పించినట్లయితే లేదా బాధపెట్టినట్లయితే, నేను క్షమాపణలు కోరుతున్నాను. అనుకోకుండా అన్న నా మాటలు ఫౌజ్ (సైన్యం)లో నా సోదరులను బాధపెట్టినట్లైతే అది నన్నూ బాధపెడుతుంది" అని రిచా చద్దా తన క్షమాపణ ట్వీట్‌ లో పేర్కొంది.

ఈ సందర్భంగా ఆమె తన తాత లెఫ్టినెంట్ కల్నల్ అని.. 1960 ఇండో-చైనా యుద్ధంలో విశిష్టమైన పాత్ర పోషించారని కాలికి బుల్లెట్ కూడా తగిలిందని రిచా పేర్కొంది. "నా మామాజీ ఒక పారాట్రూపర్. అది నా రక్తంలో ఉంది. మనలాంటి వ్యక్తులతో కూడిన దేశాన్ని రక్షించేటప్పుడు ఒక కొడుకు అమరవీరుడైనప్పుడు లేదా గాయపడినప్పుడు కుటుంబం మొత్తం ప్రభావితమవుతుంది. అది ఎలా ఉంటుందో నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఇది నాకు భావోద్వేగ సమస్య" అని రిచా తన ప్రకటనలో పేర్కొంది. దీనికి సవీనా బేడీ సచార్ అనే న్యాయవాదిని ట్విట్టర్ లో ట్యాగ్ చేసింది.

కాగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే భారత సైన్యానికి ప్రథమ లక్ష్యమని గతంలో రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ షిండే ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తాజాగా ఓ ప్రకటన చేశారు. భారత సైన్యానికి సంబంధించినంత వరకు, కేంద్ర ప్రభుత్వమిచ్చే ఏ ఉత్తర్వునైనా అమలు పరుస్తుంది. అటువంటి ఆదేశాలు ఇచ్చినప్పుడు, మేము ఎల్లప్పుడూ వాటి కోసం సిద్ధంగా ఉంటామని అన్నారు. ఉభయ దేశాల ప్రయోజనాల కోసం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయకుండా చూసుకోవడానికి సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా అది విచ్ఛిన్నమైతే, మేము వారికి తగిన సమాధానం ఇస్తామని ద్వివేది పేర్కొన్నారు.
Tags:    

Similar News