బ్రిటన్ ప్రధాని రేసులో 'రిషి'కి పెరుగుతున్న మద్దతు.. తాజాగా ఎవరెవరంటే?

Update: 2022-07-13 09:30 GMT
వందల ఏళ్లు భారత్ ను పాలించిన బ్రిటన్ కు.. ఇప్పుడు భారత మూలాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే అవకాశం రావటం తెలిసిందే. దీనిపై భారతీయుల్లో ఉత్కంట నెలకొని ఉంది. ప్రఖ్యాత టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడైన రిషికి.. బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా చెబుతున్నారు.

ప్రధాని రేసులో ఉన్నారంటూ ప్రచారం జరిగిన బ్రిటన్ హోం సెక్రటరీ యాభై ఏళ్ల ప్రీతి పటేల్ తాను ప్రధాని ఎన్నికల రేసులో లేనట్లు స్పష్టం చేయటం ఆసక్తికరంగా మారింది. దీంతో.. రిషికి అవకాశాలు మరింత మెరుగైనట్లుగా చెబుతున్నారు.

నిజానికి ప్రితీ కూడా ప్రధాని రేసులో బలమైన అభ్యర్థిగా ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లే ఆమె మద్దతుదారులు సైతం ప్రకటనలు చేశారు. ప్రీతిని కొందరు ఉక్కు మహిళ మార్గరేట్ థాచర్ తో పోల్చారు కూడా.

ఇలాంటి ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. సీన్లోకి వచ్చిన ఆమె.. తాను ప్రధాని రేసులో లేనని స్పష్టం చేశారు. దీనికి కారణం ప్రధానమంత్రిగా పదవిని చేపట్టేందుకు అవసరమైన ఎన్నికల రేసులోకి రావటానికి కనీసం 20 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రీతికి అంతమంది ఎంపీల మద్దతు లేదు. ఆమెకు కేవలం 13 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది.

ప్రీతి సైతం భారత సంతతికి చెందిన మహిళే కావటం విశేషం. ఇదిలా ఉంటే బ్రిటన్ ప్రధాని రేసులో బలంగా పేరు వినిపిస్తున్న రిషి.. సదరు జాబితాలో మూడో స్థానంలో ఉన్నట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా రిషికి మద్దతు ప్రకటిస్తూ పలువురు ఎంపీలు ప్రకటనలు చేయటం గమనార్హం. ఉప ప్రధాని డోమినిక్ రాబ్.. రవాణా శాఖా మంత్రి గ్రాంట్ షాప్స్ లు రిషి సునాక్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రకటనలు చేశారు. నిజానికి గ్రాంట్ షాప్స్ కూడా ప్రధాని రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించిన ఆయన.. రిషి అనుభవానికి.. అర్హతకు తాను మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో.. రిషికి ప్రధాని అయ్యే అవకాశాలు మరింత మెరుగైనట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News