ప్రధాని ఎన్నికల్లో ఓడితే ఏం చేస్తాడో చెప్పిన రిషి.. రిజల్ట్ వచ్చేదెప్పుడంటే?

Update: 2022-09-05 04:54 GMT
యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికకు సంబంధించిన తుది ఫలితం వచ్చేది ఈ రోజునే. బ్రిటన్ కాలమానం ప్రకారం ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12.30 గంటల వేళకు బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2 అధికారిక ప్రకటన చేయనున్నారు.

సుదీర్ఘ ప్రక్రియగా సాగిన ప్రధానమంత్రి పోటీకి భారత సంతతికి చెందిన రిషి సునాక్.. దేశ విదేశాంగ మంత్రి  లిజ్ ట్రస్ లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

రిషి సునాక్ వయసు 42 ఏళ్లు కాగా.. లిజ్ ట్రస్ వయసు 47 ఏళ్లు. ఇప్పటివరకు జరిపిన సర్వేల ఫలితాల సారాంశం చూస్తే.. రిషి కంటే లిజ్ ట్రస్ వైపే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎక్కువ మంది తమ మద్దతును తెలుపుతున్న విషయం తెలిసిందే. లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికైతే బ్రిటన్ ప్రధానిగా మార్గరెట్ థాచర్.. థెరిసా మే తర్వాత ఆ దేశ పగ్గాల్ని చేపట్టిన మూడో మహిళగా నిలుస్తారు. మొత్తం 1.6 లక్ష లమంది నేరుగా.. పోస్టల్ బ్యాలెట్ తోనూ తమ ఓట్లు వేశారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటానికి ఒక రోజు ముందు ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ.. ఈ ఇద్దరు అభ్యర్థుల్ని కలిపి ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన రిషి సునాక్ పలు కీలక అంశాల్ని వెల్లడించారు.

ఎన్నికల్లో ఓటమి పాలైతే తదుపరి ప్రణాళిక ఏమిటన్న దానికి బదులిచ్చిన రిషి.. పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని.. తన సొంత నియోజకవర్గమైన రిచ్ మండ్.. యార్క్ షైర్ ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. మళ్లీ ప్రధాని రేసులో పాల్గొంటారా? అన్న ప్రశ్నకు మాత్రం నేరుగా సమాధానం ఇవ్వకపోవటం గమనార్హం.

కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్న విషయాన్ని రిషి స్పష్టం చేశారు. ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వస్తే.. తమ ప్రాధాన్యతల్లో ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించటం..  గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గిస్తామని రిషి.. ట్రస్ లు ఇద్దరు పేర్కొనటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఈ ఎన్నికల్లో లిజ్ ట్రస్ విజయం ఖరారైందని.. రిషి ఓటమి తప్పదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News