బోరిస్ జాన్స‌న్‌పై రిషి సునాక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Update: 2022-08-13 05:33 GMT
బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న భార‌త సంత‌తి నేత రిషి సునాక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇంగ్లండ్ లోని చెల్టెన్‌హామ్‌లో టోరీ సభ్యులతో చర్చలో పాల్గొన్నారు.. రిషి సునాక్. ఈ సంద‌ర్భంగా తాను బ్రిట‌న్ ఆర్థిక శాఖ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసినప్పటి నుంచి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సందర్భంగా పార్టీగేట్‌ కుంభకోణంలో బోరిస్‌ జాన్సన్ ప్ర‌ధానిగా ఉండి పార్లమెంటును తప్పుదోవ పట్టించారా? లేదా? అనే విషయంపై కొనసాగుతోన్న పార్లమెంటరీ విచారణపై రిషి సునాక్‌ అభిప్రాయాన్ని కోరగా.. ఇది పూర్తిగా పార్లమెంటరీ ప్రక్రియ అని ఆయ‌న తెలిపారు.

ఇది ప్రభుత్వ ప్రక్రియ కాద‌న్నారు. కామన్స్‌ ప్రివిలేజెస్‌ కమిటీలోని ఎంపీలను గౌరవిస్తాన‌ని చెప్పారు. ఎంపీలు సరైన నిర్ణయాలు తీసుకుంటార‌ని రిషి సునాక్ బ‌దులిచ్చారు.

వ్యక్తిగతంగా తాను ఉన్నత ప్రమాణాలను విశ్వసిస్తాన‌ని రిషి సునాక్ చెప్పారు. ప్రధానమంత్రి అయిన వెంటనే మంత్రివర్గ ప్రయోజనాల కోసం స్వతంత్ర సలహాదారుడిని తిరిగి నియమిస్తాన‌ని తెలిపారు. విశ్వాసం, చిత్తశుద్ధి, మర్యాదలు.. రాజకీయ ఆత్మకు సంబంధించిన అంశాల‌ని వివ‌రించారు. దీంతో టోరీ సభ్యుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కాగా.. వేల్స్ పర్యటనలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌ను రిషి సునాక్ కామెంట్ల‌పై మీడియా ప్ర‌శ్నించ‌గా ఆయన స‌మాధానం చెప్ప‌కుండా దాటవేశారు. బోరిస్ జాన్స‌న్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయానని చెబుతూ.. ఆయ‌న మంత్రివ‌ర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునాక్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తదనంతర పరిణామాలు బోరిస్ జాన్స‌న్ ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేసేలా చేశాయి. ప్రస్తుతం ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌ తుది పోటీలో ఉన్న విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News