తెల్లోళ్ల ప్రధాని మనోడేనని తేలిన తర్వాత తొలి స్పీచ్ లో ఏం చెప్పారంటే?

Update: 2022-10-25 04:08 GMT
వందల ఏళ్లు భారత దేశాన్ని ఏలటమే కాదు.. మన సంపదను కొల్లగొట్టిన నాటి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తర్వతి కాలంలో తాము ఏలిన దేశానికి చెందిన వ్యక్తి ఒకరు తమ దేశానికి ప్రధానమంత్రి అవుతారని కలలో కూడా ఊహించి ఉండరు. ఎవరూ అనుకోనివి జరగటమే చరిత్ర గొప్పతనం. ఎప్పటికప్పుడు కొత్త లెక్కల్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. పాత లెక్కలు సెట్ చేసే గుణం కాలానికి ఉంటుంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు ఇదే భావన కలుగక మానదు.

ఏ జాతిని అయితే బానిసల మాదిరి.. తెలివితక్కువ సన్నాసుల మాదిరి.. కల్చర్ తెలియని వెధవలుగా తెల్లోళ్లు చిత్రీకరించారో.. ఇప్పుడు అదే జాతికి చెందిన వ్యక్తి ఒకరు బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేత కానుండటం తెలిసిందే.

అనూహ్య పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన లిజ్ ట్రస్ కేవలం నెలన్నర వ్యవధిలోనే ప్రధాని పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవటం తెలిసిందే. దీంతో మనోడు రిషి సునాక్ కు బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లభించింది.

టోరీ సభ్యుల మద్దతుతో పాటు.. మరోవైపు ప్రధాని పదవి పోటీలో బోరిస్ జాన్సన్.. పెనీ మోర్డౌంట్ లు పోటీ నుంచి తప్పుకోవటంతో ప్రధానిగా రిషి పదవీ బాధ్యతల్ని చేపట్టటం ఖరారైంది. దీంతో రిషి ఎన్నిక ఏకగ్రీవం కావటంతోపాటు.. తర్వాలోనే ఆయన ప్రధాని పదవీ బాధ్యతల్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రిషి కీలకమైన తన ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా తనకు లభించిన అద్భుత అవకాశాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నందుకు తన పార్టీ ఎంపీలు.. నేతలకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నారు. తాను ఎంతగానో ప్రేమించే పార్టీకి దేశానికి సేవ చేసేందుకు తన జీవితంలో లభించిన అతి పెద్ద గౌరవంగా ఆయన అభివర్ణించారు. 'యూకే గొప్ప దేశం. కానీ.. ప్రస్తుత సమయంలో మన దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మనకు స్థిరత్వం కావాలి.ఐక్యత కావాలి. మన పార్టీని.. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావటానికి నేను అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవటానికి.. మన భవిష్యత్ తరాలను గొప్పగా నిర్మించటానికి ఇదే ఏకైక మార్గం' అని పేర్కొన్నారు.

అంతేకాదు.. చిత్తశుద్ధితో.. అణుకువతో తాను ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. 'బ్రిటీష్ ప్రజలకు అనునిత్యం సేవ చేస్తాను' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బ్రిటీషర్ల మనసుల్ని దోచుకుంటున్నాయి. మరోవైపు.. భారత సంతతి చెందిన రిషి సునాక్.. వందల ఏళ్లు భారత భూమిని ఏలిన దేశానికి ఏలిక కావటాన్ని భారతీయులంతా తెగ ఆనందానికి గురవుతున్నారు. భారత మూలాలు ఉన్న వారంతా ఎంతో ఆనందానికి గురయ్యే తరుణంగా అభివర్ణిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News