బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో సునాక్.. ఈ సారి గెలుపు ఖాయ‌మే!

Update: 2022-10-23 13:15 GMT
బ్రిట‌న్ ప్రధాని పదవికి తాను పోటీపడుతున్నట్లు ఆ దేశ‌ మాజీ మంత్రి, భార‌త మూలాలు ఉన్న‌ రిషి సునాక్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు కన్జర్వేటివ్‌ పార్టీ నాయత్వానికి పోటీపడుతున్నట్లు పేర్కొన్నారు. గొప్ప దేశమైన యూకే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు సునాక్‌ వెల్లడించారు. బ్రిటన్‌లోని భవిష్యత్తు తరాలకు గతంలో కంటే ఎక్కువ అవకాశాలు ఉండే అంశాన్ని తమ పార్టీ ఎంపిక నిర్ణయిస్తుందన్నారు. తమ దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించడం, పార్టీని సమైక్యంగా ఉంచి దేశానికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం కోసం తాను ప్రధాని, పార్టీ  నాయకత్వానికి పోటీపడుతున్నట్లు వెల్లడించారు.

గతంలో ఎన్నడూ ఎదుర్కోనంతగా దేశం సమస్యలను ఎదుర్కొంటోందని సునాక్‌ అభిప్రాయపడ్డారు. కానీ, మనం సరైన ఎంపిక చేసుకొంటే అవకాశాలు కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. గతంలో హామీలను నెరవేర్చిన రికార్డు తనకుందని గుర్తు చేశారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళిక తన వద్ద ఉందన్నారు. ఈ మేర‌కు సునాక్‌.. ట్వీట్ చేశారు. మ‌రోవైపు ప్రధాని పదవి రేసులో నిలిచేందుకు అవసరమైన 100 మంది టోరీ పార్టీ ఎంపీల మద్దతు తమ నేత సునాక్‌కు లభించిందని ఆయ‌న మద్ద‌తు దారులు కూడా పేర్కొన్నారు.

పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ నేతగా పోటీ పడే అభ్యర్థికి కనీసం వంద మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం పార్లమెంటులో కన్జర్వేటివ్‌ పార్టీకి 357 మంది ఎంపీలున్నారు. అంటే కనీసం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేసే వీలుంది. పెన్నీ మోర్డాంట్‌.. కూడా తాను ప్రధాని రేసులో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమెకు 20 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఇప్పటివరకు లభించినట్లు తెలుస్తోంది. మూడో అభ్యర్థిగా మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రంగంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే.. ఆయ‌న దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం నేప‌థ్యంలో సునాక్ అయితేనే బెట‌ర్ అనే సంకేతాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న గెలుపు లాంఛ‌న‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News